పాఠశాలల పునఃప్రారంభం నిర్ణయాలపై జోక్యం చేసుకోం

పాఠశాలల పునఃప్రారంభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై న్యాయవ్యవస్థ ఎటువంటి జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాఠశాలలను తిరిగి ప్రారంభించడం అనేది పూర్తిగా రాష్ట్రాల సొంత నిర్ణయమని, ఆ ప్రణాళికలను కోర్టు నాశనం చేయదని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
కరోనా మహమ్మారి కారణంగా చిన్నారుల జీవితాలు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో పాఠశాలలు తెరవాలని, భౌతిక తరగతులను ప్రారంభించాలని రాష్ట్రాలను ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. భౌతిక తరగతుల కోసం పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ఒక విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
 
‘పలు రాష్ట్రాల్లో పలురకాలుగా కరోనాపరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర పరిమాణం, జనసాంద్రతకు అనుగుణంగా అవి మారొచ్చు. కేసులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి.. ఎలా నడుచుకోవాలని అనేది రాష్ట్రాల నిర్ణయం. అంతిమంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేలా వదిలేయడం ఉత్తమం’ అని చంద్రచూడ్‌ పేర్కొన్నారు. 
 
”పాఠశాలలు తెరిచేటప్పుడు, పిల్లలు వైరస్‌ బారిన పడకుండా ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి… అలాంటప్పుడు కోర్టులు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా దీనికి సంబంధించి మన వద్ద ఎటువంటి డేటా లేని సమయంలో.. ” అని అభిప్రాయపడ్డారు. 
 
అయితే విద్యార్థిని తిరిగి పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత, ఈ విషయంలో జవాబుదారీతనం అంతిమంగా ప్రభుత్వానిదే అని స్ఫష్టం చేశారు. పిటిషన్‌ దాఖలు చేసిన విద్యార్థికి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ సందర్భంగా పలు సూచనాత్మక హెచ్చరిక చేశారు. తన వాదనలకు మద్దతిచ్చేలా తక్కువ లేదా అసలు డేటా లేకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం కంటే సదరు విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు.