వచ్చే మూడు నెల‌ల్లో 100 కోట్ల టీకా డోసుల సేక‌ర‌ణ‌

రానున్న మూడు నెల‌ల్లో భార‌త్ 100 కోట్ల కొవిడ్‌-19 టీకా డోసుల‌ను సేక‌రిస్తుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ సోమ‌వారం తెలిపారు. అక్టోబ‌ర్‌లో 25 కోట్ల డోసులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వీ టీకాలను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. జైడ‌స్ క్యాడిలా వ్యాక్సిన్‌కు భార‌త్‌లో అత్య‌వ‌స‌ర వాడ‌కానికి ఇటీవ‌ల ఆమోదం ల‌భించింది.

ఇక భార‌త్‌లో మిగులు వ్యాక్సిన్ నిల్వ‌ల ఎగుమ‌తి త‌దుప‌రి క్వార్ట‌ర్‌లో చేప‌డ‌తామ‌ని ఆరోగ్య శాఖ మంత్రి వెల్ల‌డించారు. ఇత‌ర దేశాల కొవిడ్ టీకా అవ‌స‌రాల‌ను తీర్చేందుకు భార‌త్ వ్యాక్సిన్ మైత్రి కార్య‌క్ర‌మం కింద వివిధ దేశాల‌కు టీకాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తొలుత దేశ పౌరుల‌కు వ్యాక్సినేష‌న్ చేప‌ట్ట‌డానికే ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద‌ని మంత్రి స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ డోసుల దేశీ ఉత్పాద‌నను వేగవంతం చేసేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో దేశంలో టీకాల ఉత్ప‌త్తి భారీస్ధాయిలో జ‌రుగుతోంద‌ని మాండ‌వీయ పేర్కొన్నారు.

 కాగా, వ‌చ్చే నెల‌ నుంచి టీకాల ఎగుమ‌తిపై చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు కేంద్ర  మంత్రి తెలిపారు. ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్‌లో త‌యార‌య్యే వ్యాక్సిన్ల‌ను అందించ‌నున్నామ‌ని, డ‌బ్ల్యూహెచ్‌వో చేప‌డుతున్న కోవాక్స్ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 

వ‌చ్చే నెల‌లో అద‌నంగా 30 కోట్ల కోవిడ్ డోసులు రానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ కోవిడ్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ద‌ని, దాంతో అందుబాటులోకి కొత్త టీకాలు వ‌స్తాయ‌ని, ఇత‌ర కంపెనీలు కూడా త‌మ ఉత్ప‌త్తుల‌ను మార్కెట్లోకి తీసుకువ‌స్తున్న‌ట్లు మంత్రి మాండ‌వీయ చెప్పారు.