గుజరాత్‌ తీరంలో పట్టుబడ్డ విజయవాడ కంపెనీ డ్రగ్స్

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడింది. ముంద్రా పోర్టుకు వచ్చిన కంటైనర్లలో హెరాయిన్‌ సరఫరా అవుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

ఒక కంటైనర్‌ నిండా హెరాయిన్‌ వచ్చినట్లు గుర్తించారు. ఈ హెరాయిన్‌ కంటైనర్‌ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. తదుపరి విచారణ కోసం అధికారులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. టాల్కం పౌడర్‌ ముసుగులో కోట్ల విలువైన డ్రగ్స్‌ దిగుమతి అవుతున్నట్లు డీఆర్‌ఐ అధికారులు కనుగొన్నట్లు తెలుస్తున్నది.

మాదక ద్రవ్యాలతో ఉన్న ఇరాన్‌ బోటును భారత నౌకదళం స్వాధీనం  ఉగ్రవాద వ్యతిరేక దళం (ఎటిఎస్‌), గుజరాత్‌ పోలీసులతో సంయుక్తంగా శనివారం రాత్రి గుజరాత్‌ తీరప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉన్న ఏడుగురు ఇరానీయుల్నీ తదుపరి విచారణ కోసం తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో ఉన్న ఆషి ట్రేడింగ్‌ సంస్థ ఈ కంటైనర్లను ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ముంద్రా పోర్టుకు దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరుకును టాల్కం పౌడర్‌ను సంస్థ ప్రకటించినట్లు అధికారులు చెప్తున్నారు. ఎగుమతి సంస్థ హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌గా గుర్తించారు. ఐదు రోజులుగా డీఆర్‌ఐ అధికారులతోపాటు కస్టమ్స్‌ అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి చివరకు భారీ ఎత్తున దిగుమతి అయిన డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

ఆ హెరాయిన్‌ను గుజరాత్‌ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కాగా, స్మగ్లింగ్‌ రాకెట్‌ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇతమిత్థంగా ఇంకా ఓ అంచనాకు రాలేదు. గుజరాత్‌ నుంచి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారా లేక విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్‌ నుంచి చెన్నై తరలించాలన్నది స్మగ్లర్ల ప్రణాళికా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరును మాత్రమే స్మగ్లింగ్‌ రాకెట్‌ వాడుకుంటోందా అన్న దాంట్లో వాస్తవం ఎంతన్నది అంతుబట్టడం లేదు.

ప్రస్తుతానికి అషీ ట్రేడింగ్‌ కంపెనీకి చెం దిన ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సింథటిక్‌ డ్రగ్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా తె ప్పించి విక్రయిస్తున్న ముఠాను గుంటూరు పో లీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. అంతలోనే రూ.9వేల కోట్ల హెరాయిన్‌ స్మగ్లింగ్‌లో విజయవాడ కేంద్ర బిందువుగా ఉందని తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ దందాపై పోలీస్, డీఆర్‌ఐ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవ ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

గత కొన్నేళ్ల నుంచి పాకిస్తాన్‌ లేదా ఇరాన్‌ నుంచి డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేసే మార్గంగా గుజరాత్‌ తీర ప్రాంతం మారిపోయింది. గత ఏప్రిల్‌లో ఎనిమిదిమంది పాకిస్తానీయులను అరెస్టు చేసి, రూ.150 కోట్ల విలువైన హెరాయిన్‌ ఉన్న బోటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో ఐదుగురు పాకిస్తానీయులను అరెస్టు చేసి, రూ.175 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. 2017 జులైలో సుమారు రూ.3,500 కోట్ల విలువైన 1500 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.