పంజాబ్‌ కొత్త సీఎం చన్నీతో మహిళల భద్రతకు ముప్పు

పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్ చన్నీ వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉన్నదని జాతీయ మహిళా కమిషన్  ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో ‘మీ టూ’ ఉద్యమం సమయంలో ఆయనపై  పలు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.  రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్నదని గుర్తు చేశారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నాడు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ధర్నా చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు.

ఈ రోజు ఒక మహిళ నేతృత్వంలోని పార్టీ ద్వారా చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇది మహిళలకు ద్రోహం చేయడమే అని రేఖా శర్మ విమర్శించారు. ఆయన వల్ల మహిళల భద్రతకు ముప్పు ఉందని పేర్కొన్నారు. 

చన్నీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి అర్హుడు కాదని ఆమె ఆమె స్పష్టం చేశారు. చన్నీని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని తాను కోరుతున్నానని చెప్పారు.

తనకు మంత్రిగా ఉన్న సింగ్ అభ్యంతరకరమైన సందేశాలు పంపారని అంటూ ఒక మహిళా ఐపీఎస్ అధికారి సెప్టెంబర్, 2018లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశం ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన మంత్రిని పిలిచి మందలించారు. దానితో మంత్రి ఆ అధికారికి క్షమాపణలు చెప్పారు. 

ఈ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నానని, ఆ అధికారికి సంతృప్తి కలిగే విధంగా పరిష్కరించానని ఆ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా ఆ మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఒక మహిళా  జర్నలిస్ట్ లైంగిక వేధింపులు గతంలో ఎప్పుడో జరిపినట్లు ఆరోపణలు చేయడంతో కేంద్ర మంత్రివర్గం నుండి ఎంజే అక్బర్ ను తొలగించమని డిమాండ్ చేసిన కాంగ్రెస్, తమ పార్టీకి చెందిన మంత్రి విషయంలో మౌనం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి.