ఎంపీ సీట్ కు రూ 5 కోట్లు … ఆర్‌జెడి నేత తేజస్విపై ఎఫ్‌ఐఆర్‌

లోక్‌సభ టికెట్‌ ఇప్పిస్తానంటూ.. రూ.5 కోట్లను తీసుకున్న కేసుకు సంబంధించి ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ పై  ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. తేజస్వితోపాటు ఆయన సోదరి మీసాభారతి, బిహార్‌ పిసిసి అధ్యక్షుడు మదన్‌మోహన్‌ ఝా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజేశ్‌ రాథోడ్‌, సుభానంద్‌ ముఖేశ్‌లపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. 
 
2019 ఎన్నికల్లో భాగంగా భాగల్పూర్‌ లోక్‌సభ టికెట్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఐదుగురు నేతలు తన నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్‌ నేత సంజీవ్‌ కుమార్‌ సింగ్‌ గత నెల 18 న పట్నా కోర్టులో కేసు వేశారు. సొమ్ము తీసుకొని తనకు ఆ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని, అదేమని అడిగితే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఖాయమన్నారని, ఆ ఎన్నికల్లోనూ తనకు టికెట్‌ రాలేదని వాపోయారు. 
 
దీంతో ఆ ఐదుగురు నేతలపై సంజీవ్‌ పట్నా కోర్టులో కేసు వేశారు. కేసుకు సంబంధించిన ఐదుగురు నేతలు . 1.ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌, 2. తేజస్వియాదవ్‌ సోదరి మీసా భారతి, 3.బీహార్‌ పిసిసి అధ్యక్షుడు మదన్‌మోహన్‌ ఝా, 4.కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజేశ్‌ రాథోడ్‌, 5.సుభానంద్‌ ముఖేశ్‌ లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పట్నా కోర్టు పోలీసులను ఆదేశించింది.
తనకు టికెట్ ఇవ్వలేదని తేజస్వి ని కలిసి అడిగితే తనను బెదిరించారని కూడా ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలను ఆర్జేడీ ఖండించింది. ఇవ్వన్నీ దురుద్దేశ్యంతో చేస్తున్న ఆరోపణలుగా కొట్టివేసింది.