ముంబైలో రూ 150 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గత ఏడాది కాలంలో ముంబై, థానేతోపాటు పరిసర ప్రాంతాల్లో రూ.150కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్ సమీర్‌ వాంఖడే తెలిపారు. ఎన్‌డీపీఎస్‌ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్) చట్టం కింద 114 కేసులను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

34 మంది విదేశీయులు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సహా 300 మందికిపైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఏడాది కాలంలో 100 కేజీలకుపైగా డ్రగ్స్‌, 30 కేజీల చరాస్‌, 12 కిలోల హెరాయిన్‌, రెండు కేజీల కొకైన్‌, 350 కిలోల గంజాయి పట్టుకున్నామని చెప్పారు.

60 కిలోల ఎఫిడ్రిన్‌, 25 కిలోల ఎండీ (మెఫెడ్రోన్‌) స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లకు చెందిన రూ.12కోట్లకుపైగా విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మాదక ద్రవ్యాల ద్వారా సంపాదించిన నగదు, ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. 

స్మగ్లర్ల బంధువులపై సైతం అభియోగాలు మోపినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌ స్మగ్లర్లు బంధువులు, స్నేహితుల పేరిట ఆస్తులు కొనుగోలు చేస్తారని, వారితో సంబంధాలున్న వారిపై ఆస్తులుంటే జప్తు చేయనున్నట్లు తెలిపారు.