ఆఫ్ఘన్ సంక్షోభం బాధ్యత అమెరికాదే…. షాంఘై సంస్థ స్పష్టం 

ఆఫ్ఘనిస్తాన్‌లో అన్ని వర్గాలను అధికారంలో భాగస్వాముల్ని చేసేలా తాలిబాన్లను ఒప్పించి, అక్కడ సాధారణ పరిస్థితులను తిరిగి నెలకొనేలా చూడాల్సిన బాధ్యత అమెరికాదేనని షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) స్పష్టం చేసింది. అమెరికా 20ఏళ్లుగా ఆఫ్ఘన్‌లో తిష్టవేసి గత నెల్లో వైదొలగింది. నేడు ఆఫ్ఘనిస్తాన్‌ ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని నివారించాల్సిన బాధ్యత పశ్చిమ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు ఉందని అది గుర్తు చేసింది. 
 
తజకిస్తాన్‌ రాజధానిలో జరిగిన ఎస్‌సిఓ సమావేశంలో ఆఫ్ఘన్‌ భవితవ్యంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆన్‌లైన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాట్లాడుతూ, ఘర్షణల అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లో చేపట్టే పునర్నిర్మాణ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులో ప్రధాన భాగాన్ని అమెరికా, నాటో దేశాలే భరించాలని కోరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న తీవ్ర పర్యవసానాలకు, పరిణామాలకు వారే ప్రత్యక్ష బాధ్యులని పేర్కొన్నారు. 
 
స్తంభింపచేసిన ఆఫ్ఘన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆస్తులను వెంటనే ఆఫ్ఘన్‌కు ఇవ్వాలని కోరారు. నిధులు అందుబాటులోకి రాకపోతే ఆఫ్ఘన్‌ కొత్త పాలకులు ఇతర మార్గాలైన ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా నిధులను సమకూర్చు కునేందుకు ప్రయత్నిస్తారని హెచ్చరించారు. ఆఫ్ఘన్‌ కొత్త పాలకులు తమ హామీలను నెరవేర్చేలా, దేశంలో భద్రతా వాతావరణాన్ని మెరుగుపరిచేలా ఎస్‌సిఓ తన అధికారాన్ని, శక్తి సామర్ధ్యాలను ఉపయోగించాలని పుతిన్‌ కోరారు. 
 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ, ఆఫ్ఘన్‌ భవిష్యత్‌ అభివృద్ధి కోసం నిర్దిష్ట దేశాలు తమ వంతు బాధ్యతలను చేపట్టాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని సంబంధిత పక్షాలు కూడా తీవ్రవాదాన్ని నిర్మూలించి, యుద్ధంతో అతలాకుతలమైన దేశానికి మరింత సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మరింత విస్తృతమైన, అన్ని వర్గాలను కలుపుకుని పోయే రాజకీయ చట్రపరిధిని దేశంలో రూపొందించేలా ప్రోత్సహించడం అవసరమని చెప్పారు. 
 
ప్రస్తుతం అక్కడ మానవతా సంక్షోభాన్ని నివారించడం అన్నింటికన్నా ముఖ్యమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రధానంగా విదేశీ సాయంపై ఆధారపడిందని, ఇప్పుడు అది లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  
 
తీవ్రవాదం, యుద్ధం, డ్రగ్స్ లేని స్వతంత్ర, ప్రజాస్వామ్య, శాంతియుత ఆఫ్ఘనిస్తాన్‌కు మద్దతునిస్తూ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నాయకులు యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో అన్ని జాతి, మత, రాజకీయ సమూహాలకు ప్రాతినిధ్యంతో  “అందరినీ కలుపుకొని” ప్రభుత్వం ఉండటం చాలా కీలకమని స్పష్టం చేశారు. సభ్య దేశాల నాయకులు ఉమ్మడి ప్రకటనలో తీవ్రవాదాన్ని అన్ని రూపాల్లో మరియు వ్యక్తీకరణలలో తీవ్రంగా ఖండించారు.

సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవలి పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతి,  భద్రతకు సంబంధించిన అతి పెద్ద సవాళ్లకు రాడికలైజేషన్ “మూల కారణం” అని నిరూపించాయని పేర్కొన్నారు.  ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉమ్మడిగా కార్యాచరణ ఏర్పర్చుకోవాలని సూచించారు.