తాలిబన్‌ లక్ష్యంగా జలాలాబాద్‌లో రెండు రోజూ పేలుళ్లు

ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల లక్ష్యంగా జలాలాబాద్‌లో వరుసగా శనివారం నుండి పేలుళ్లు జరుగుతున్నాయి.  కాబూల్‌కు 80 మైళ్ల దూరంలోని నంగర్‌హార్ ప్రావిన్షియల్ రాజధాని జలాలాబాద్‌లో ఆదివారం బోర్డర్‌ పోలీస్‌ వాహనంపై ప్రయాణిస్తున్న తాలిబన్ల లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. 

ఈ ఘటనలో మరణించిన ఐదుగురిలో ఇద్దరు పౌరులు ఉన్నట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఏపీ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాల లక్ష్యంగా శనివారం జరిగిన మూడు బాంబు పేలుళ్లలో ఇద్దరు తాలిబన్‌ ఫైటర్లతోసహా ముగ్గురు చనిపోగా 19 మంది గాయపడ్డారు.

జలాలాబాద్‌పై పట్టు ఉన్న ఐఎస్‌ఐఎస్‌-కే తాలిబన్‌ లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్ట్‌ 25న కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద జరిగిన బాంబ్ పేలుడులో 60 మందికిపైగా మరణించారు. ఇది తమ పనేనని ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

 సున్నీ అతివాద మిలిటెంట్లకు ఇస్లామిక్ స్టేట్‌, తాలిబాన్లే లక్ష్యంగా మారారు. కాగా, ఆగస్ట్‌ 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి.