ఏపీలో విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి 

ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని  గుర్తు చేశారు. 

విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలపై పెను భారం మోపుతోందని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో పేదల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. ఇలా ఉండగా,  ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు దిగజారి ప్రవరిస్తున్నాయని కన్నా దుయ్యబట్టారు.

రాజుకీయ నాయకుడికి బాష, ప్రవర్తన  ముఖ్యమని మొదటి నుంచి చెపుతున్నామని తెలిపారు. నిన్న టీడీపీ, వైసీపీ నేతలు దుర్భాషలు ఆడుకోవడం రాష్ట్ర ప్రజలు అందరు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ప్రజా ప్రతినిధి రెండు లక్షల మందికి ఆదర్శమని గుర్తించాలని హితవుపలికారు. రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలు మెచ్చే పాలన అందిస్తామని కన్నా భరోసా ఇచ్చారు.

కాగా, గుంటూరు నగరంపాలెంలో రేషన్ షాపును బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రధాని మంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చిన రేషన్ పంపిణీపై ఆరా తీశారు. రేషన్ షాపులు వద్ద, రేషన్ వ్యాన్‌పై మోదీ ఫోటో లేకపోవడం బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ షాపు వద్ద గరీభ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, రావెల, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ కరోనా సమయంలో ఒక్కోక్కరి 5 కిలోల బియ్యం కేంద్రం ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిదిగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో ఇచ్చే రేషన్‌లో 30 శాతం కేంద్రం సబ్సీడీ ఇస్తుందని తెలిపారు. కానీ కేంద్రం చేసే సాయం ఎక్కడా చెప్పడం లేదని మండిపడ్డారు. వైఎస్, జగన్‌ల ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదని, ప్రతి రేషన్ షాపు వద్ద మోదీ ఫోటో పెట్టాలని రావెల డిమాండ్ చేశారు.