అయ్యన్న పాత్రుడి ఇంటి ముట్టడి యత్నం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై శుక్రవారం రాళ్లదాడికి పాల్పడిన వైసీపీ నేతలు, శనివారం మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఉమాశంకర్ ఫోన్ చేసి, అయ్యన్నపై ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతలు మాట్లాడుతూ అయ్యన్న వ్యాఖ్యల్లో అభ్యంతరం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం, శాంతియుత ఆందోళనలు చేయడంరా జకీయాల్లో సంప్రదాయంగా వస్తోందని పేర్కొన్నారు. కానీ ఇలా దౌర్జన్యాలకు పాల్పడడడం వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. 

గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకంటే.. ప్రస్తుతం అయ్యన్న ఎక్కువగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలను పరామర్శలకు కూడా అంగీకరించని పోలీసులు.. వైసీపీ నేతలకు మాత్రం గొడలవలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

కాగా,  తాను సీఎం జగన్ ను తిట్టలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కావాలనే వైసీపీ నేతలు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. చెత్తపై పన్ను వేసినవారిని చెత్త పాలన అంటే తప్పా ? అని ప్రశ్నించారు. నిరంతరం బూతులు మాట్లాడే మంత్రిని బూతుల మంత్రి అనడం తప్పా ? అని నిలదీశారు. తాను ప్రభుత్వ విధానాలపై మాట్లాడాను తప్పా.. వ్యక్తిగతంగా మాట్లడలేదన్నారు. తనను అరెస్టు చేసినా సిద్ధమేని స్పష్టం చేశారు.