జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షం

జిల్లా, మండల పరిషత్‌ లకు జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. ఆదివారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైన తరువాత వెలువడిన ఫలితాల్లో రాష్ట్రమంతా వైసిపి హవా కొనసాగింది. జడ్‌పిటిసిలతో పాటు, ఎంపిటిసిల్లోనూ మెజార్టీ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఏకపక్ష ఫలితాలతో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను వైసిపి కైవసం చేసుకోనుంది.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నామమాత్రపు ప్రభావాన్నే చూపింది. పోలింగ్‌కు ముందు ఆ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కడపటి వార్తలు అందే సమయానికి వైసిపి 616 జడ్‌పిటిసి, 8,200 ఎంపిటిసి స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి 7  ఎంపిటిసి  , 616 ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందింది. జనసేన 179 ఎంపిటిసి, 2  జడ్‌పిటిసి   స్థానాలలో, బిజెపి 28  ఎంపిటిసి స్థానాల్లో, సిపిఎం 1 జడ్‌పిటిసి, 15 ఎంపిటిసి స్థానాలు గెలుపొందాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 660 జడ్‌పిటిసి స్థానాలకు గానూ 126 స్థానాలు ఏకగ్రీవమైనాయి. 515 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 261 స్థానాలను వైసిపి గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 3 జడ్‌పిటిసి స్థానాలు మాత్రమే దక్కాయి. సిపిఎం ఒక స్థానంలో గెలుపొందింది. జడ్‌పిటిసి ఎన్నికల బరిలోకి దిగి నామినేషన్లు దాఖలు చేసిన తరువాత అభ్యర్థులు మృతి చెందడంతో 11 స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరో 8 స్థానాల్లో వివిధ కారణాలతో ఫలితాలు ప్రకటించలేదు. 

నెల్లూరు జిల్లాలో 34 జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగగా అన్నిటిని వైసిపి గెలుచుకుంది. అన్ని జిల్లాల్లోనూ అత్యధిక జడ్‌పిటిసి స్థానాలను వైసిపి గెలుచుకుంది. దీంతో అన్ని జిల్లా పరిషత్‌లు ఆ పార్టీ ఆధీనంలోకి వెళ్లాయి.

మొత్తం 10,047 ఎంపిటిసి స్థానాలకుగానూ 7219 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో 4,887 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. టిడిపికి 627 స్థానాలు దక్కాయి. జనసేన 61 ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందింది. సిపిఎం 15 స్థానాల్లో, సిపిఐ 7 స్థానాల్లో గెలుపొందాయి. జనసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన బిజెపికి 18 ఎంపిటిసి స్థానాలు దక్కగా, కాంగ్రెస్‌ 3 చోట్ల గెలుపొందింది. స్వతంత్రులు 128 ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందారు.

జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం సజావుగా పూర్తి కావడంతో జడ్పీ, ఎంపీపీలకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసి షెడ్యూల్‌ని ఖరారు చేసింది. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

ఈ నెల 24న ఉదయం 10 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యన నామినేషన్లు పరిశీలిస్తారు. 12 తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు నామి నేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలానే మధ్యాహ్నం 1 గంట నుంచి సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునేం దుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.

పరిషత్‌ ఎన్నికల్లో సంక్షేమానికే ప్రజలు పట్టం కట్టారని పంచాయతీరాజ్  మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫలితాలు టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెంప చెల్లుమనిపించాయని తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో 85 శాతానికి పైగా స్థానాలు గెలిచామని చెప్పారు. ఆదర్శపాలనకు ప్రజలు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. 

కాగా,  పరిషత్‌ ఎన్నికల ఫలితాలు బోగస్‌ అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. అందువల్లే తమ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించిందని తెలిపారు.