గృహ రుణాలపై ఎస్‌బిఐ అందరికి ఒకే వడ్డీ రేట్

దేశంలో ప్రస్తుత పండుగల సీజన్‌లో ఇళ్లు కొనాలనుకుంటున్న వారిని ఆకర్షించడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేతనం, వేతనేతర జీవులకు ఇకపై గృహ రుణంపై ఒకే విధమైన వడ్డీ రేటును అమలు చేయాలని నిర్ణయించింది. ఇంతక్రితం వేతనజీవుల కంటే ఉద్యోగేతరుల రుణంపై అదనంగా 15 బేసిస్‌ పాయింట్ల వడ్డీ వసూలు చేసేవారు. 

తాజా నిర్ణయంతో వేతనం, వేతనం లేని రుణగ్రహీత మధ్య వ్యత్యాసాన్ని ఎస్‌బిఐ తొలగించినట్లయ్యింది. దీంతో జీతం లేని రుణగ్రహీతలకు ఇది 15 బిపిఎస్‌ల వడ్డీని ఆదా కానుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్‌ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్‌ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గఅహ రుణాలను అందిస్తున్నట్లు తెలిపింది.

గృహ రుణాలపై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. అదే విధంగా ఎంత రుణం తీసుకున్నా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. ఈ తరహా రుణ రేటు బ్యాంకింగ్‌ పరిశ్రమలనే తొలిసారి. అదే విధంగా ప్రాసెసింగ్‌ ఫీజును కూడా మాఫీ చేసింది. 

ఇప్పటి వరకూ ఎవరైనా రూ.75 లక్షల గృహ రుణం తీసుకుంటే 7.15 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. ఈ తాజా ఆఫర్‌తో ఏకంగా 45 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. దీనివల్ల రూ.75 లక్షల రుణంపై 30 ఏళ్ల వ్యవధిపై రూ.8 లక్షల వరకూ వడ్డీ ఆదా కానుందని ఎస్‌బిఐ తెలిపింది. 

‘మా కాబోయే గృహ రుణ వినియోగదారుల కోసం పండుగ ఆఫర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈసారి, మేము ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాము. అందిరికి ఒకే విధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70 శాతం వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్‌ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గృహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని నమ్ముతున్నాము” అని ఎస్‌బిఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌) సిఎస్‌ సెట్టి వెల్లడించారు.