పాక్ ఆధిపత్యంపై తాలిబన్ ధిక్కార ధోరణులు!

ఆఫ్ఘానిస్తాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరగడానికి పాకిస్థాన్ జోక్యమే కారణమని తెలుస్తున్నది. 
 
అంతర్జాతీయంగా మద్దతు కూడదీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు ప్రయత్నించగా ఐఎస్ఐ అధిపతి కాబుల్ లో మకాం వేసి కరడుగట్టిన తీవ్రవాదులతో ప్రభుత్వం ఏర్పాటు జరిగేటట్లు చూసి, ఒక విధంగా తమను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. తమపైననే వారు ఆధారపడాలి, ఇతర దేశాలతో సఖ్యతతో ఉండరాదనే విధంగా పాక్ వ్యవహారం ఉన్నట్లు భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా దోహా కేంద్రంగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ, అమెరికా సేనలు ఆఫ్ఘన్ నుండి వైదొలగడంతో కీలక భూమిక వహించిన బరదార్‌ ను ప్రధాని కాకుండా అడ్డుకొని, కరడుగట్టిన తీవ్రవాదిగా పేరొందిన ముల్లా హసన్ అఖుంద్ తాత్కాలిక ప్రధాన మంత్రి కావడం పాకిస్థాన్ జోక్యంతోనే అని స్పష్టం అవుతున్నది. 
 
మొదటి నుండి, ముల్లా హసన్ అఖుంద్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బరదార్‌ పాకిస్థాన్ వ్యతిరేకి కాగా, భారత్ అనుకూలురుగా పేరొందారు. అందుకనే తమ కనుసన్నలలో ఉండే అఖుంద్ ను పట్టుబట్టి ప్రధాని అయ్యేటట్లు చేశారు. అప్పటి నుండి, అఖుండ్,  బరదార్‌ల మధ్య ఆధిపత్య వివాదాలు తలెత్తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో డిప్యూటీ ప్రధాని బరదార్‌ గాయపడటం లేదా మరణించి ఉంటారని లేదా కరోనా బారిన పడి ఉంటారన్న వదంతులు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే తాను మరణించినట్లు వస్తున్న పుకార్లను తోసిపుచ్చుతూ ఒక ఆడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.
 
‘నా మరణం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. గత కొన్ని రాత్రులు నేను పర్యటనలకు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా, నా సోదరులు, స్నేహితులతో సహా అంతా క్షేమంగా ఉన్నాము’ అని బరదార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వంపై పాకిస్థాన్ జోక్యం నివారించుకునేందుకు తాలిబన్లు ప్రయాణిస్తుండడం మన పొరుగుదేశంకు మింగుడు పడటం లేదు.  
 
కొన్ని రోజుల క్రితం కాబూల్ విమానాశ్రయాన్ని పునర్నిర్మించి, తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు పాకిస్తాన్‌ ముందుకురాగా.. తాలిబాన్‌ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పనులను టర్కీ, ఖతార్‌లకు అప్పగించింది. అనంతరం, తాలిబాన్‌కు పరిపాలనలో సహాయం చేస్తామని పాకిస్తాన్‌ ప్రతిపాదన తేగా.. తమ సొంత అంగీకారం ప్రకారం పని చేస్తామని చెప్పి తిరస్కరించింది.
ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో కూడా పాకిస్తాన్ ప్రతిపాదనను తాలిబాన్‌ సున్నితంగా తిరస్కరించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ రూపాయిల్లో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్పింది. దీనిని తాలిబాన్‌ నేతలు ఖండించారు. తమ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
 
ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వంతో బలమైన వ్యాపార సంబంధాలను కోరుకుంటున్నామని, దీని కోసం పాకిస్తాన్ కరెన్సీని ఉపయోగించాలని భావిస్తున్నట్లు ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్ పార్లమెంటులో, బయట మాట్లాడుతూ చెప్పారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు రెండు దేశాలు పాక్‌ కరెన్సీని ఉపయోగించవచ్చని తారిన్ సూచించారు. 
 
మూడు రోజుల మౌనం తర్వాత, పరస్పర వ్యాపారం మా కరెన్సీలోనే జరుగుతుందని మేం స్పష్టం చేయాలనుకుంటున్నామని తాలిబాన్‌ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్‌ స్పష్టం చేశారు. ‘కరెన్సీ మార్పిడి చేయం. మేం మా గుర్తింపునకు విలువ ఇస్తాం. అలాగే ఉండాలని కోరుకుంటాం, ఈ విషయంలో రాజీ పడేది లేదు’ అని వాసిక్‌ తెలిపారు.