అదనపు ఫీజు చెల్లిస్తే అమెరికా గ్రీన్‌కార్డు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునేందుకు ప్రస్తుతం బైడెన్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త బిల్లు ఆమోద ముద్ర పొందినట్లైతే అదనపు ఫీజు చెల్లించడం ద్వారా అమెరికాలో చట్టబద్ధంగా వుండొచ్చు. ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు కోసం అమెరికాలో ఏళ్ళ తరబడి లక్షలాదిమంది వేచిచూస్తున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య గణనీయంగా వుంది. 

ప్రతిపాదిత బిల్లు చట్టరూపం దాల్చితే వీరందరి ఆశలు నెరవేరుతాయి. దీనివల్ల వేలాది మంది భారతీయ ఐటి నిపుణులు లాభపడతారని భావిస్తున్నారు. గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌ క్యూలో చిక్కుకున్న వారి ప్రయోజనార్థం ఈ బిల్లును తీసుకురానున్నట్టు ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ తెలిపింది. 

అదనపు ఫీజును (సూపర్‌ ఫీజు) చెల్లించిన వారికి గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌ క్యూ అడ్డంకులను తొలగించనున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. ఇందులో భాగంగా ప్రాధాన్య తేదీ దాటి రెండేండ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు.. 5 వేల డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. 

ఇబి-ఎస్‌ కేటగిరీ (ఇమ్మింగెట్‌ ఇన్వెస్టర్లు) వారికి ఈ ఫీజు 50 వేల డాలర్లుగా వుంటుంది. 2031లో ఈ నిబంధనలకు కాలం చెల్లుతుందని ఫోర్బ్స్‌ మేగజైన్‌ పేర్కొంది. కుటుంబం ప్రాతిపదికన వుండే ఇమ్మిగ్రెంట్లకు గ్రీన్‌ కార్టు రావాలంటే 2,500 డాలర్లు చెల్లించాల్సి వుంటుంది. దరఖాస్తుదారుని ప్రాధాన్యతా తేది రెండేళ్లలోపు లేకుంటే, కానీ దేశంలో వుండాల్సిన అవసరం వుంటే వారు 1500 డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

దరఖాస్తుదారు చెల్లించే పాలనాపరమైన ప్రాసెసింగ్‌ ఫీజుకు ఈ ఫీజు అదనంగా వుంటుంది. చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థకు శాశ్వత వ్యవస్థాగతమైన మార్పులేవీ ఈ బిల్లులో లేవు. అంటే గ్రీన్‌ కార్డులకు పరిమితులు తొలగించడం, లేదా హెచ్‌-1బి వీసాల వార్షిక కోటాలను పెంచడం వంటి చర్యలేవీ తీసుకోలేదు. 

ఈ బిల్లు చట్ట రూపం దాల్చాలంటే జ్యుడీషియరీ కమిటీ, ప్రతినిధుల సభ, సెనెట్‌లు ఈ నిబంధనలను ఆమోదించాల్సి వుంది. అధ్యక్షుడు సంతకం చేయాల్సి వుంటుంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే ఎలాంటి పత్రాలు లేని ఇమ్మిగ్రెంట్లు అంటే పిల్లలుగా అమెరికాకు వచ్చినవారు, తాత్కాలిక రక్షిత హోదా (టెంపరరీ ప్రొటెక్టెడ్‌ స్టేటస్‌-టిపిఎస్‌) లబ్దిదారులు, వ్యవసాయ కూలీలు, కరోనా కాలంలో వచ్చిన ఇతర వర్కర్లు వీరందరూ కూడా శాశ్వతంగా అమెరికాలో నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.