హిందూ మహిళతో ముస్లిం పురుషుడి రెండో వివాహం చెల్లదు

హిందూ మహిళతో ముస్లిం పురుషుడి రెండో వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోని సెక్షన్ 4 కాపాడబోదని గౌహతి హైకోర్టు చెప్పింది. అటువంటి వివాహం శూన్యం, చెల్లనిది అవుతుందని వివరించింది. షహబుద్దీన్ అహ్మద్ రెండో భార్య దీపమణి కలిత. ఆయన కామరూప్ (రూరల్) జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో లాట్ మండల్‌గా పని చేసేవారు. 

2017లో రోడ్డు ప్రమాదంలో అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు.  అనంతరం పింఛను, ఇతర ప్రయోజనాలను ఆమెకు అధికారులు మంజూరు చేయలేదు. దీంతో ఆమె కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆమె పన్నెండేళ్ళ కొడుకును పోషిస్తున్నారు. ప్రత్యేక వివాహ చట్టం, 1954లోని సెక్షన్ 4ను హైకోర్టు వివరించింది. ప్రత్యేక వివాహం చేసుకోవడానికి సంబంధించిన షరతుల్లో ఒకటి – ఇరువురిలో ఎవరికీ సజీవంగా ఉన్న భార్య లేదా భర్త ఉండకూడదని తెలిపింది. 

పిటిషనర్‌, షహబుద్దీన్ అహ్మద్ చేసుకున్న పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించేనాటికి ఆయనకు ఓ భార్య సజీవంగా ఉందనే విషయంలో వివాదం లేదని తెలిపింది. మొదటి భార్యతో ఆయన వివాహం రద్దయినట్లు తెలిపే డాక్యుమెంట్ ఏదీ లేదని పేర్కొంది. 

రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ, ఆమె మైనర్ కుమారునికి పింఛను, తదితర ప్రయోజనాల్లో వాటా పొందే హక్కు ఉందని తెలిపింది. ఆ బాలుని పేరు మీద బ్యాంకు ఖాతాను పిటిషనర్ తెరవవచ్చునని తెలిపింది.