75 కోట్ల డోసులు దాటిన కరోనా టీకాల పంపిణీ

కరోనా టీకాల పంపిణీలో భారత్ 75 కోట్ల డోసులకు పైగా పంపిణీ మార్కును దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 75 కోట్ల డోసులకు పైగా మార్కును దాటినట్లు ఆయన తెలిపారు.

ఇదే రేటు కొనసాగితే డిసెంబర్ నాటికి దేశంలో 43 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికాగలదని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాత్, సబ్ కా ప్రయాస్ పూనిక వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలోనే కొత్త రికార్డును సృష్టిస్తోందని చెప్పారు. హ్యాష్ ట్యాగ్ సబ్కో వ్యాక్సిన్ ముఫ్త్ వ్యాక్సిన్, హ్యాష్ ట్యాగ్ ఆజాదీ అమృత్ మహోత్సవ్ కింద ఆయన ఈ ట్వీట్లు చేశారు.

ఇప్పటి వరకు సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, దాద్రా అండ్ నాగర్ హవేలి, లడఖ్ అండ్ లక్ష్యద్వీప్ వంటి ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వయోజనులు అందరికి కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా వేసినట్లు ఆయన వివరించారు. ఈ ఘనత సాధించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది. 

భారత్ 10 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును దాటేందుకు 85 రోజులు పట్టిందని, మరో 45 రోజుల్లో 20 కోట్లు, ఆ తరువాత 29 రోజుల్లో 30 కోట్ల మైలురాయిని అధిగమించగలమని మాండవీయ తెలిపారు. దేశంలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారికందరికీ వ్యాక్సినేషన్ వేసే డ్రైవ్ ను ఏప్రిల్ 1 నుంచి ఆరంభించారు. ఆ తరువాత దానిని 18 ఏళ్లు దాటిన వారికందరికీ మే 1 నుంచి విస్తరించారు. కాగా కరోనా కొనసాగింపు స్థితిని  రెగ్యులర్ గా సమీక్షిస్తున్నట్టు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, కరోనా మూడో వేవ్‌ కనీసం మూడు నెలల అనంతరం రానుందని బెనారస్‌ హిందూ యూనివర్శిటీ (బిహెచ్‌యు) శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా వైరస్‌ గురించి అధ్యయనం చేస్తున్న బిహెచ్‌యు శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్‌ చౌబె మాట్లాడుతూ కరోనా థర్డ్‌ వేవ్‌ అంత ప్రమాదకరంగా ఉండదనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. 

టీకాలతో కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయినా, మరణాలను తగ్గించగలమని ఆయన తెలిపారు. దేశంలో ముమ్మరంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కరోనా మూడో వేవ్‌ను కొంతమేరకు అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. మొదటి, రెండవ వేవ్‌లను పరిగణలోకి తీసుకుంటే, థర్డ్‌వేవ్‌ అంత ప్రమాదకరంగా మారదని వివరించారు.

కోవాగ్జిన్‌కు వారంలో డ‌బ్ల్యూహెచ్‌వో అమ‌నుతి
 
భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు ఈ వారంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అనుమ‌తులు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం భారత్ లో ఈ టీకాను అత్య‌వ‌స‌ర అమ‌నుతి కింద వినియోగిస్తున్నారు.
 
 దీంతో పాటు కోవీషీల్డ్‌ను కూడా భారత్ లో వాడుతున్నారు. అయితే కోవీషీల్డ్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి ఉంది. కోవాగ్జిన్ తీసుకున్న అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి ద‌క్కితే, అప్పుడు ఆ వారికి పెద్ద ఊర‌ట క‌లుగుతుంది.