చైనాలో చిచ్చు పెడుతున్న ఉగ్రవాద సంస్థను గెంటేస్తున్న తాలిబన్లు!

తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తామని, అంతర్జాతీయ సమాజం కూడా వారిని ఆదరించాలని ప్రకటనలు చేస్తూ వచ్చిన చైనా ఆఫ్ఘానిస్తాన్ లో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వంపై మంచి పట్టు సాధించినట్లు స్పష్టం అవుతున్నది. వ్యూహాత్మకంగా కీలకమైన బగ్రామ్‌ ఎయిర్‌ బేస్ ను చైనాకు అప్పగించడంతో పాటు చైనాకు మింగుడుపడని ఉగ్రవాద సంస్థ ఈస్ట్‌ తుర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ (ఈటీఐఎం)ను తమ దేశం నుంచి తమ దేశం నుండి తరిమివేయడానికి సహితం సిద్దపడిన్నట్లు వెల్లడవుతుంది.
 
తాలిబాన్లు అఫ్ఘాన్‌ను ఒక్కో ప్రావిన్సుగా ఆక్రమించడం ప్రారంభించిన తొలిరోజుల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ యీ ఖతార్‌లోని తాలిబాన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో సమావేశమై ఈటీఐఎం గురించి స్పష్టమైన హామీ పొందిన్నట్లు తెలుస్తోంది. ఈటీఐఎం ఉగ్ర సంస్థ చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉయ్‌గర్‌ ముస్లింల తరఫున పోరాడుతోంది. 
 
జిన్‌జియాంగ్‌ స్వాతంత్య్రం కోసం వేర్పాటువాదాన్ని అందుకుంది. అఫ్ఘాన్‌తో చైనా 75 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నది కూడా జిన్‌జియాంగ్‌ ప్రావిన్సును ఆనుకుని ఉండడం గమనార్హం. అయితే నేరుగా ఈ ఉగ్రవాద సంస్థ నేతలను చైనాకు అప్పగించి, సోదర ముస్లిం ప్రపంచంలో వ్యతిరేకతను తెచ్చుకోకుండా, మర్యాదగా వారిని దేశం వదిలి వెళ్ళమని హుకుం జారీచేశారు. 
 
ఈ విషయాన్ని తాలిబాన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షాహిన్‌ శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్ధారిస్తూ ‘‘అఫ్ఘాన్‌ గడ్డపై ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు తావు ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు. 
 
అయితే ఆఫ్ఘన్ లో స్థావరాలు ఏర్పాటు చేస్తుకున్న  అల్‌-ఖాయిదా, ఐఎస్ఐ-కే వంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలపై మొత్తం ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఆఫ్ఘన్ గడ్డపై అటువంటి ఉగ్రవాద సంస్థలకు తావు లేకుండా చూడామని కోరుతున్నా తాలిబన్లు లెక్కచేయడం లేదు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యక్రమాలు చేబడుతున్న ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వొద్దని భారత్ కోరుతున్నా స్పందించడం లేదు.
బాలికల ఉన్నత విద్యకు సానుకూలం 
 
మరోవంక, గత పాలనలో బాలికలు 5వ తరగతి వరకే చదవాలని, ఆపై చదువులపై తాలిబన్లు నిషేధం విధించారు. అయితే, ఇప్పుడు మాత్రం మహిళలు ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఆపద్ధర్మ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. కానీ, హిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. 
 
అలా కుదరకుంటే వేర్వేరు తరగతులు ఉండాల్సిందేనని, సిలబ్‌సను కూడా సమీక్షిస్తామని వివరించారు. బాలికలు, మహిళలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ఉంటుందని, ముఖం కప్పుకొనేలా నకాబ్‌, హిజాబ్‌ తప్పనిసరి అని వెల్లడించారు. 
 
కాగా.. తాలిబాన్ల భయంతో అఫ్ఘాన్‌లోని సంగీతకారులు పాకిస్థాన్‌కు వలస వెళ్తున్నారు. ఇప్పటికే దిగ్గజ సంగీతకారులు పేషావర్‌ చేరుకున్నారు. కాబూల్‌ విమానాశ్రయంలో 12 మంది మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరారు. వారంతా భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. డొమెస్టిక్‌ విమాన సేవలు ప్రారంభమైన నేపథ్యంలో  మహిళా ప్రయాణికులను వారు తనిఖీ చేస్తారు.