పెగాస‌స్ వివాదంలో దాచి పెట్టింది ఏమీ లేదు

పెగాస‌స్ వివాదంలో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తాము ఎలాంటి స‌వివ‌ర అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని సోమ‌వారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో తాము దాచి పెట్టింది ఏమీ లేదని స్పష్టం చేసింది. అందుకే ప్ర‌భుత్వ‌మే త‌న‌కు తానుగా ఈ ఆరోప‌ణ‌ల‌పై విచారణ జ‌ర‌ప‌డానికి నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది అని సీజేఐ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌తో కూడిన ధ‌ర్మాస‌నానికి కేంద్రం వెల్లడించింది. 

 చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం పెగాసస్‌పై విచారణ జరిపింది. పెగాసస్ స్పైవేర్ అంశంపై మధ్యంతర ఉత్వర్తులు ఇస్తామని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 

ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను ప్ర‌భుత్వం వాడిందా లేదా అన్న‌ది బహిరంగంగా  చ‌ర్చించే అంశం కాదని పేర్కొంటూ,  ఈ అంశాన్ని అఫిడ‌విట్‌లో భాగం చేయ‌డం జాతి ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాదు అని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా ధ‌ర్మాస‌నానికి చెప్పారు. నిపుణుల క‌మిటీ నివేదిక‌ను తాము కోర్టు ముందు ఉంచుతామ‌ని మాత్రం హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఏమైనా స్పైవేర్‌ నిఘాను ఉపయోగించిందా? అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి సొలిసిటర్ జనరల్ సమాధానం ఇస్తూ.. స్పైవేర్‌ అంశంపై లోక్‌సభలో ఐటీ మంత్రి వివరణ ఇచ్చారని తెలిపారు.అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రం సుముఖంగా లేనందున మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సీజేఐ ఎన్వీరమణ పేర్కొన్నారు.