బరాబర్‌ హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనం బరాబర్‌ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దీనిపై వెంటనే స్పందించి సాగర్‌లోనే గణేశ్‌ నిమజ్జనం చేసే విధంగా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఉత్తర్వులు తీసుకువచ్చినా..  తీసుకురాకున్నా హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం చేయడం ఖాయమని చెప్పారు. 
 
అనుమతి తీసుకునిహిందువుల పండుగలను జరుపుకునే దౌర్భాగ్యం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం మెదక్‌ జిల్లాలోని కొల్చారం మండలం దుంపలకుంట, రంగంపేట గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో బండి సంజయ్‌ మాట్లాడుతూ  దళితబంధు మాదిరిగానే బీసీ, గిరిజన బంధు ఇవ్వాలని బీజేపీ అడగడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
 
పెన్షన్‌లు, రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా వంటి పథకాలేవీ అందడం లేదని ప్రజలు తనను కలిసి కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఘణపురం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు.  ఈ నెల 17న పాదయాత్రలో కేంద్ర మంత్రి అమిత్‌షా పాల్గొంటారని తెలిపారు.

అబద్ధాల పునాదులపై కేసీఆర్‌ పాలన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఆదివారం మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలోని చాముండేశ్వరీ ఆలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేయించి, అక్కడి నుంచి ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించారు. 

కొల్చారం మండలం రంగంపేటలో ఏర్పాటు చేసిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఎంత మంది పేదలకు ఇళ్లు ఇచ్చారో చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద తెలంగాణకు 2.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే.. పేదలకు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తూ నాణ్యత లేకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు రావాలని.. ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు కావాలో ఇప్పిస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే పది లక్షల ఇళ్లు కూడా ఇప్పిస్తామని చెప్పారు. బీజేపీ గెలిచినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టడం కేసీఆర్‌కు అలవాటేనని అంటూ బీజేపీ అంటే కేసీఆర్‌కు పంచ తడుస్తుందని ఎద్దేవా చేశారు.

రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఆ దిశగా ఇప్పటికీ చర్య తీసుకోకుండా రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటే రైతులకు నష్టపరిహారం మాట అటుంచి, కనీసం వారిని పలకరించే నాథుడే లేరని విచారం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసి, ఒక్కో వ్యక్తి మీద లక్ష రూపాయల భారం మోపిన ఘనుడు కేసీఆర్‌ అని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలు ప్యాకేజీ పార్టీలుగా మారాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చే ప్యాకేజీ కోసం కాంగ్రెస్‌ సభలు పెడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఒక్కటి కాబట్టే.. ఆ పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరారని చెప్పారు. 2018-19 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన డబ్బులతోనే కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీ చేసిందని విజయశాంతి ఆరోపించారు. అప్పుడు కాంగ్రె్‌సలో ఉండి ఇవన్నీ చూస్తున్నా మాట్లాడలేని పరిస్థితి అని పేర్కొన్నారు.