ఆఫ్ఘన్ల మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా!

ఆఫ్ఘానిస్తాన్ ను గత నెల 15న తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు శనివారం జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సెప్టెంబర్‌ 11న మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని గత మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మిత్ర దేశాలైన పాకిస్థాన్‌, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్‌, కతర్‌ సహా పలు దేశాలను ఆహ్వానించారు.

అయితే అమెరికాలోని న్యూయార్క్‌ జంట టవర్లపై జరిగి నేటితో 20 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేమని మిత్రదేశాలు తెలిపినట్లు సమాచారం. దోహా నుంచి వచ్చిన ఒత్తిళ్లతో తాలిబన్లు ఈ కార్యక్రమాన్ని వాయిదావేసినట్లు తెలుస్తున్నది.  ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ప్రకటించలేదు. నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం రద్దు చేసినట్లు రష్యాకు చెందిన టీఏఎస్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ .వెల్లడించింది

ఈమేరకు తాలిబన్ల కల్చురల్‌ కమిషన్‌ సభ్యుడైన ఇమానుల్లా సమంగాని తెలిపినట్లు పేర్కొంది. ‘ఆఫ్ఘన్‌ నూతన ప్రభుత్వ ప్రారంభోత్సవ వేడుక కొన్ని రోజుల క్రితమే రద్దయింది. ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా ఉండటానికి ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గాన్ని ప్రకటించింది. వారు పనిచేయడం కూడా ప్రారంభించారు’ అని ఇనాముల్లా సమంగాని ట్వీట్‌ చేశారని తెలిపింది. అమానవీయ ఘటన జరిగిన రోజు ప్రమాణం నిర్వహిస్తున్నారని అమెరికా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేసింది. కార్యక్రమానికి వెళ్లొద్దని కతార్‌పై అగ్రరాజ్యం ఒత్తిడిచేసినట్లు సమాచారం.

పాక్ మదరసాలోనే మంత్రుల చదువు

తాలిబన్లు ఏర్పర్చిన మంత్రివర్గంలోని పలువురు కీలక వ్యక్తులు పాకిస్తాన్ జిహాదీ యూనివర్సిటీగా పేరొందిన పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న జామియా దారుల్ ఉలూమ్ హక్కానియా అకోడా ఖటక్ మదరసాలో చదువుకున్న వారే. సైనిక శిక్షణకు పేరొందిన ఈ మదరసా  అఫ్ఘానిస్తాన్‌ను సోవియట్ ఆక్రమించుకున్నాక అక్కడి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది.

మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదులతో తాలిబాన్ క్యాబినెట్ ఏర్పడింది. ప్రధాని ముల్లా మొహమ్మద్ హసన్ ప్రపంచ తీవ్రవాదుల జాబితాలో ఉన్నాడు.తాలిబన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిరాజుద్దీన్ హక్కానీ తలపై అమెరికా ప్రభుత్వం రూ. 73 కోట్ల రివార్డు ప్రకటించింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం… తాలిబన్ క్యాబినెట్‌లో స్థానం సంపాదించిన మంత్రులలో ఐదుగురు పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల హక్కానియా మదరసాలో చదువుకున్నారు.

ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ (జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి), మౌలానా అబ్దుల్ బాకీ (ఉన్నత విద్యాశాఖ మంత్రి), నజీబుల్లా హక్కానీ (సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి), మౌలానా నూర్ మొహమ్మద్ సాకిబ్ (హజ్ మంత్రి), అబ్దుల్ హకీం సహ్రాయ్ (న్యాయ మంత్రి) తదితరులు ఈ జిహాదీ యూనివర్శిటీలోనే చదువుకున్నారు.