ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడు దారుణ హత్య

గ‌త నెల 15న ఆఫ్ఘ‌నిస్థాన్‌ను కైవ‌శం చేసుకున్న తాలిబ‌న్ల‌కు పంజ్‌షీర్ ప్రాంతంలో కంటిలో న‌లుసుగా మారిన యాక్టింగ్ ప్రెసిడెంట్ అమృతుల్లా సాలేహ్‌పై క‌సి తీర్చుకున్నారు. సాలేహ్ సోద‌రుడు రోహుల్లా సాలేహ్‌ను మ‌ట్టుబెట్టారు. తొలుత పంజ్‌షీర్‌లో త‌మ‌కు ప‌ట్టుబ‌డిన రోహుల్లా సాలేహ్‌ను తొలుత కొర‌డాలు, విద్యుత్ వైర్ల‌తో తీవ్రంగా కొట్టారు. 

అటుపై ఆయ‌న‌ గొంతు కోశారు. త‌ర్వాత‌ బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. రోహుల్లా సాలేహ్‌ పంజ్‌షీర్ నుంచి కాబూల్‌కు వెళుతుండ‌గా తాలిబ‌న్ల‌కు చిక్కాడు. కొన్ని రోజుల క్రితం అమృతుల్లా సాలేహ్ వీడియో విడుద‌ల చేసిన చోటే ఆయ‌న సోద‌రుడు రోహుల్లా సాలేహ్‌ను తాలిబ‌న్లు చంపేశారు.

పంజ్‌షీర్‌ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకోలేద‌ని అమృతుల్లా సాలేహ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. తన ఆఖ‌రి శ్వాస విడిచే వ‌ర‌కు పంజ్‌షీర్‌లోనే ఉంటాన‌ని తేల్చి చెప్పారు. రోహుల్లా సాలెహ్‌ మృతి అనంతరం తాలిబన్లు అతడి లైబ్రరీని ఆక్రమించారని సమాచారం. గ్రంథాలయంలోకి ప్రవేశించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు.

నాలుగు రోజుల క్రితం తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించగా,  పంజ్‌షీర్‌ నాయకులు తాలిబన్ల ప్రభుత్వాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో పంజ్‌షీర్‌ ప్రాంత నాయకులు, మాజీ అఫ్గన్‌ పాలకులు ఉగ్రవాద అఫ్గన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి తొందరపడవద్దని తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

తాలిబన్లు ఏర్పాటు చేసిన కేబినెట్‌లో హిట్‌లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. తాలిబన్ల ఆక్రమణ ప్రాంరంభం అయిన నాటి నుంచి  పంజ్‌షీర్  లోయలో అహ్మద్ మసూద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దళాలకు, తాలిబన్లకు మధ్య మొదలైన భీకరపోరు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

 ఇలా ఉండగా, ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని రష్యా అధికార ప్రతినిధి క్రెమ్లిన్‌ స్పష్టం చేశారు. అంతకుముందు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రష్యా సహకరిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో క్రెమ్లిన్‌ ఖండించారు.  తాము తాలిబన్ల ప్రభుత్వ  ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. 

‘తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటును గుర్తిచాలన్న ఉత్సుకతతో ఉంది. కానీ దశాబ్దాలుగా యుద్ధంతో అట్టుడుకుపోతున్న అఫ్గన్‌ ప్రజలు తమ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని వారు భావిస్తున్నారా ? ‘ అని భారతదేశంలోని రష్యన్ రాయబారి నికోలాయ్ కుడాషెవ్ అంతకు ముందు సంశయం వ్యక్తం చేశారు.