కేరళలో రాజకీయ దుమారం రేపుతున్న ‘లవ్ నార్కోటిక్ జిహాద్’

కేథలిక్ బిషప్ జోసెఫ్ కల్లారాంగట్ చేసిన  ‘లవ్ అండ్ నార్కోటిక్ జిహాద్’ ప్రకటన కేరళలో పెను రాజకీయ దుమారంకు దారితీసింది.  ఆయన వాఖ్యాలను కాంగ్రెస్ విమర్శించగా, బిజెపి మద్దతు ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి పినారయి విజయన్ సహితం `నార్కోటిక్ జిహాద్’ అనే పదాన్ని మొదటిసారి వింటున్నానని చెప్పారు. మాదక ద్రవ్యాలకు, మతానికి సంబంధం లేదని కొట్టిపారవేసారు. బిషప్ ఏ సందర్భంలో ఇటువంటి వాఖ్యలు చేశారో తనకు తెలియదని పేర్కొన్నారు.
సామాజిక, ఆధ్యాత్మిక నాయకులు రాష్ట్రంలో శాంతియుత వాతావరణనాన్ని నాశనం చేసే ప్రకటనలు చేయకుండా ఉండాలని
సోషల్ మీడియా ద్వారా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, విడి సతీశన్  అభ్యర్థించారు. “కులం, మతం ఆధారంగా నేరాల సంఖ్యను లెక్కించడం, ఏదైనా నిర్దిష్ట సమాజాన్ని దానికి నిందించడం తీవ్రమైన తప్పు. బిషప్ జోసెఫ్ కల్లరంగట్ ప్రకటన పరిమితులను దాటింది” అని ఆయన విమర్శించారు.

మత నాయకులు స్వీయ నియంత్రణ, సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పిటి థామస్ కూడా అటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ  బిషప్ ప్రకటన సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. “మత సామరస్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతున్న సామాజిక వర్గాలను విభజించడానికి ఎవరూ ఇంధనం ఇవ్వకూడదు” అని ఆయన హితవు చెప్పారు.

అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ ప్రముఖ సిరో-మలబార్ చర్చికి చెందిన బిషప్‌కు మద్దతు ఇస్తూ, ఆయన చెప్పింది  “తీవ్రమైన సమస్య” అని, మన సమాజం చర్చించి విశ్లేషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.  “బిషప్ తన స్వంత అనుభవం ఆధారంగా చెప్పారు. ఇది ఎటువంటి పక్షపాతం లేకుండా చర్చించాల్సిన తీవ్రమైన సమస్య. కొంతమంది వ్యక్తులు చర్చకు ఎందుకు భయపడతారు?” ఆయన ఇక్కడ విస్మయం వ్యక్తం చేశారు.

కల్లరంగట్ వాదనలకు మద్దతు ఇస్తూ, బిజెపి అధ్యక్షుడు ‘నార్కోటిక్ జిహాద్’ రాష్ట్రంలో వాస్తవమని, కేరళలో రేవ్ పార్టీలకు సంబంధించి అరెస్టయిన వారికి తీవ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కేరళ లేదా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ మాఫియాకు ఉగ్రవాద గ్రూపులతో విడదీయరాని అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు.

“నిజం చెప్పినందుకు అన్ని మూలల నుండి బిషప్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పింది కొత్త విషయం కాదు. ఆయన ఏ ప్రత్యేక సమాజాన్ని కూడా నిందించలేదు. కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని మాత్రమే నిందించారు” అంటూ సురేంద్రన్ ప్రకటనకు మద్దతు తెలిపారు.  

కాగా, కొట్టాయం కేంద్రంగా ఉన్న ముస్లిం సంస్థ పాల బిషప్‌పై జిల్లా పోలీసు చీఫ్‌కు ఫిర్యాదు చేసింది. కాథలిక్ పూజారిపై చట్టపరమైన చర్యలను కోరుతూ కొట్టాయంలోని తాలూకా సంస్థ మహల్లు ముసిమ్ కోఆర్డినేషన్ కమిటీ ఫిర్యాదు చేసింది. ఆయన  ప్రకటన సమాజాన్ని మతపరమైన ధోరణిలో ఉద్దేశపూర్వకంగా విభజించే ప్రయత్నమని ఆరోపించింది.

“అటువంటి మతపరమైన ప్రకటన చేసినందుకు అతనిపై ఐపీసీ 153 ఎ  కింద కేసు నమోదు చేయాలి” అని ఆ సంస్థ కార్యదర్శి అజాస్ థాచట్ కోరారు. ఐపీసీ153 ఎ  అనేది మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్యాన్ని కాపాడడానికి హాని కలిగించే చర్యలను సూచిస్తుంది. 

  కేరళలో క్రైస్తవ బాలికలు ఎక్కువగా “ప్రేమ, మాదకద్రవ్యాల జిహాద్” కు గురవుతున్నారని, ఎక్కడైతే ఆయుధాలు ఉపయోగించలేరో అక్కడ తీవ్రవాదులు ఇతర మతాలకు చెందిన యువతను నాశనం చేయడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారని జోసెఫ్ కల్లరంగట్ చేసిన ప్రకటన ఈ దుమారంకు దారితీసింది.

ఈ జిల్లాలోని కురవిలంగడ్‌లో జరిగిన చర్చి వేడుకల సందర్భంగా భక్తులను ఉద్దేశించి బిషప్ మాట్లాడుతూ, “లవ్ జిహాద్” లో భాగంగా, ముస్లిమేతర బాలికలు, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి చెందిన వారు, ప్రేమలో చిక్కుకుని, దోపిడీకి గురైన తర్వాత ఎక్కువగా మతమార్పిడి గురవుతున్నారు. ఉగ్రవాదం వంటి విధ్వంసక కార్యకలాపాల కోసం వారిని దుర్వినియోగం కావిస్తున్నారు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మన లాంటి ప్రజాస్వామ్య దేశంలో, ఇతర మతాల ప్రజలను నాశనం చేయడానికి ఆయుధాలను ఉపయోగించడం అంత సులభం కాదు కాబట్టి, జిహాదీలు సులభంగా గుర్తించలేని మార్గాలను ఉపయోగిస్తున్నారని బిషప్ ఆరోపించారు. దోపిడీ, బలవంతపు మత మార్పిడి, ఆర్ధిక ప్రయోజనాలు, ఉగ్రవాద కార్యకలాపాలలో ఉపాధి వంటి లక్ష్యాల కోసం, జిహాదీలు ప్రేమ లేదా ఇతర మార్గాల ద్వారా ఇతర మతాల మహిళలను ట్రాప్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
మహిళలు 18 ఏళ్లు నిండిన వెంటనే, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా బలవంతంగా తీసుకెళ్లి, వారు ప్రేమలో చిక్కుకొనేటట్లు చేస్తున్నారని, కొన్ని సంవత్సరాల వివాహం తర్వాత వారిని తరచుగా వదిలివేయడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.