తెలంగాణలో ఇక డ్రోన్ల ద్వారా టీకాలు, మందుల సరఫరా

తెలంగాణ‌లో శ‌నివారం నుంచి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టు ప్రారంభం కానున్న‌ది. ఈ మేర‌కు కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ (ఎంవోసీఏ) నుంచి చివ‌రి అనుమ‌తులు ల‌భించాయి. ప్ర‌పంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యూఈఎఫ్‌), నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబ‌ల్ (అపోలో హాస్పిట‌ల్స్‌) భాగ‌స్వామ్యంతో ఐటీఈ &సీ విభాగం అనుబంధ ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీస్‌, తెలంగాణ ప్ర‌భుత్వ ఇన్షియేటివ్‌తో ఈ ప్రాజెక్టు ప్రారంభ‌మ‌వుతున్న‌ది.
 
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్‌ నుంచి డ్రోన్ ద్వారా ప్ర‌యోగాత్మ‌కంగా వ్యాక్సిన్ల ర‌వాణాను చేప‌ట్ట‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వ‌హ‌ణ కోసం ఎంపిక చేసిన బ్లూడార్ట్ మెడ్ ఎక్స్‌ప్రెస్ క‌న్సార్టియం (స్కై ఎయిర్‌), హెలికాప్ట‌ర్ క‌న్సార్టియం (మారుత్ డ్రోన్స్‌), క్యురిస్ ఫ్లై క‌న్సార్టియం (టెక్ ఈగ‌ల్ ఇన్నోవేష‌న్స్‌) సంస్థ‌లు ఇప్ప‌టికే వికారాబాద్‌కు చేరుకున్నాయి. వ్లోస్‌, బీవీలోస్ డ్రోన్ ఫ్లైట్ల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హిస్తున్నాయి. 
శ‌నివారం జ‌రిగే ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీ రామారావు, నీతి ఆయోగ్ సీఈవో రాజీవ్ కుమార్‌, అపోలో గ్రూప్ జాయింట్ ఎండీ, వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం ఎయిరోస్పేస్ అండ్ డ్రోన్స్ ఇండియా లీడ్ పాల్గొంటారు. బీవీలోస్ డ్రోన్ల‌తో హెల్త్‌కేర్ ప‌రిక‌రాలు, వ్యాక్సిన్లు, ఔష‌ధాలు స‌ర‌ఫ‌రా చేయ‌డం దేశంలోనే తొలిసారి.