జైలుకు వెళ్లిన‌ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి తండ్రి

బ్రాహ్మ‌ణ స‌మాజాన్ని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిన‌ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్ బ‌ఘేల్ తండ్రి నంద‌కుమార్ బ‌ఘేల్‌ను ఆ రాష్ట్ర‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను రాయ్‌పూర్ కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా కోర్టు ఆయ‌నకు 15 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. 

ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన నంద‌కుమార్ బ‌ఘేల్ బ్రాహ్మ‌ణుల‌ను దేశ బ‌హిష్క‌ర‌ణ చేయాల‌న్నారు. బ్రాహ్మ‌ణుల‌ను గంగా న‌ది నుంచి ఓల్గా న‌దికి పంపించాలి. వాళ్లు విదేశీయులు. వాళ్లు మ‌న‌ల‌ను అంట‌రాని వాళ్లుగా ప‌రిగ‌ణిస్తున్నారు. మ‌న హ‌క్కుల‌ను లాగేసుకుంటున్నారని విమర్శించారు.

బ్రాహ్మ‌ణులు ఎవ‌రినీ గ్రామాల్లోకి అడుగుపెట్ట‌నివ్వ వ‌ద్ద‌ని తాను  గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను కోరతా అని నంద‌కుమార్ బ‌ఘేల్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఘ‌ట‌నపై ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేశ్ బ‌ఘేల్ మాట్లాడుతూ.. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని స్పష్టం చేశారు. “ఒక కొడుకుగా నేను ఆయ‌న‌ను గౌర‌విస్తాన‌ని, కానీ ఒక ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్య‌ల‌ను స‌హించ‌బోను” అని బ‌ఘేల్‌ వ్యాఖ్యానించారు. త‌న ప్ర‌భుత్వంలో సామాన్యుడైనా, ముఖ్య‌మంత్రి తండ్రి అయినా చ‌ట్టానికి అతీతులుకార‌ని ఆయ‌న చెప్పారు.

నంద కుమార్ (86) తమను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని అంతకుముందు బ్రాహ్మణులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.డీడీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి యోగిత కపర్దే మాట్లాడుతూ, నంద కుమార్ సమాజంలో విద్వేషాలను వ్యాపింపజేస్తున్నారని, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.