ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోయిస్టులు హతం

* ఇప్పటివరకు 88 మంది నక్సలైట్లు హతం 

లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్‌ హతమయ్యారు. 

మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మకాం వేశారని నిఘావర్గాల ద్వారా సమాచారం అందటం వల్ల స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టగా మంగళవారం ఉదయం నక్సల్స్‌ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. 

వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగురిని మట్టుబెట్టాయి. మరికొందరు నక్సల్స్‌ పరారయ్యారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 88 మంది నక్సలైట్లు మరణించారు. ఇటీవల కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 

ఇక్కడ కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 19న దేశంలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అలాంటి కీలక సమయంలో కాంకేర్ జిల్లాలోని ఛోటేబైథియా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామస్థుడిని మావోయిస్టులు హత్య చేశారు. 

ఈ తరుణంలో మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాలు, పోలీసులతో కూడిన స్పెషల్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు అడవుల్లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వారిని ప్రతిఘటించేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు.