పెట్రోలియం ఉత్పత్తులపై మూడు నెలలో రూ లక్ష కోట్లు 

పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుండి జూన్‌వరకు మూడు నెలల కాలానికి రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సిజిఎ) వెల్లడించింది. 
 
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది 48 శాతం ఎక్కువని తెలిపింది. గతేడాది ఈ మూడు నెలల కాలంలో పెట్రోలియం ఉత్పత్తులపై రూ.67,895 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చమురు బాండ్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10,000 కోట్లే కావడం గమనార్హం. 
 
అంటే ఈసారి అదనంగా వసూలైన రూ.32,492 కోట్లు కూడా చెల్లించాల్సిన మొత్తానికి 3 రెట్లకు మించి అధికమే. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో పెట్రోల్‌ వినియోగం పెరిగి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మరో రూ. లక్ష కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ రూపేణ ఖజానాకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన చమురు బాండ్లను జారీ చేసిందని, అందులో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే అప్పటి ప్రభుత్వం చెల్లించిందని, రూ.1.3 లక్షల కోట్ల అసలుకు వడ్డీ కలిపి ప్రస్తుతం చెల్లించాల్సి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నెలలో చెప్పారు. 
 
ఈ మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2021-22 లో రూ.10,000 కోట్లు, 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.