75 ఏండ్లు దాటిన వృద్ధులకు ఐటీ రిట‌ర్న్స్ అవసరం లేదు

వృద్ధుల‌కు ఆదాయం ప‌న్ను శాఖ (ఐటీ) రిలీఫ్‌నిచ్చింది. 75 ఏండ్లు దాటిన వృద్ధులంతా 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని పేర్కొంది. గ‌త ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. 75 ఏండ్లు దాటిన వృద్ధుల‌కు ఈ ఏడాది ఐటీ రిట‌ర్న్స్ నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే.

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. ప్ర‌భుత్వం నుంచి పెన్ష‌న్ పొందుతున్న పెన్ష‌న‌ర్లు తమ సేవింగ్స్ ఖాతాలు గ‌ల‌ బ్యాంకుల్లో స‌మ‌ర్పించాల్సిన ఫామ్స్‌, అందుకు సంబంధించి నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేసింది. దీని ప్ర‌కారం ఐటీ శాఖ‌లోని ఫామ్ 12బీబీఏను పెన్ష‌న‌ర్ తన ఖాతా ఉన్న బ్యాంకులో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

అదే బ్యాంకులో పెన్ష‌న్ ఖాతా నుంచి వ‌చ్చే వ‌డ్డీపై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు తెలిపింది. పెన్ష‌న్ మిన‌హా ఇత‌ర మార్గాల్లో వ‌చ్చే ఆదాయంపై ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. 

60 ఏండ్లు దాటిన వారిని సీనియ‌ర్ సిటిజ‌న్లుగానూ, 80 ఏండ్లు దాటిన వారిని సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్లుగా ధ్రువీక‌రించారు. అయితే, ఇత‌ర ఆదాయం పొందుతూ ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌కుంటే పెనాల్టీతోపాటు అధిక టీడీఎస్ వ‌సూలు చేస్తార‌ని సీబీడీటీ వెల్ల‌డించింది.

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రూ.67,400 కోట్ల ఆదాయ పన్ను రిఫండ్‌ చెల్లింపులు జరిపినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 30లోగా 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.67 వేల కోట్ల రిఫండ్‌ చేసినట్లు తెలిపింది. వీటిలో 22.61 లక్షల కేసులకు సంబంధించిన రూ.16,373 కోట్లు రిఫండ్‌ చేసిన సీబీడీటీ..కార్పొరేట్‌ ట్యాక్స్‌నకు సంబంధించి రూ.51 వేల కోట్లను తిరిగి చెల్లించింది.

పాన్‌ ఆధార్‌ లింక్‌

పాన్‌ నంబర్‌తో ఆధార్‌ను లింక్‌ చేయడానికి ఈ నెల 30వ తేదీనే చివరి తేదీ. ఒకవేళ చేయలేకపోతే పాన్‌ నంబర్‌ చెల్లుబాటు కాదు. దాంతో మరే ఆర్థిక లావాదేవీలను చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్‌ అకౌంట్‌ తెరవాలన్నా, మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లు కొనాలన్నా పాన్‌ నంబర్‌ తప్పనిసరి. 
 
ఒకవేళ పాన్‌ నంబర్‌ రద్దు కావడమో లేదా స్తంబింపచేస్తే ఈ పనులేవీ చేయలేరు. సెప్టెంబర్‌ 30 తర్వాత రూ.10,000 జరిమానా ఉంటుంది. పాన్‌-ఆధార్‌ లింక్‌ను ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి కూడా ఈ నెలాఖరే చివరి తేదీ. కొవిడ్‌ కారణంగా ఇప్పటికే ఈ గడువును జూలై 31 నుంచి పొడిగించింది ఐటీ శాఖ. ఆలస్యంగా ఫైల్‌ చేస్తే రూ.5,000 జరిమానాతో దాఖలు చేయాల్సి ఉంటుంది.