‘జగనన్న విద్యా దీవెన’ నగదు పంపిణీకి హైకోర్టు బ్రేక్ 

‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో కళాశాలలకు రేయింబర్సుమెంట్ చేయవలసిన ఫీజ్ లను విద్యార్థుల తల్లుల పేరుతో బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తూ ప్రచారంపై శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి హై కోర్ట్ లో చుక్కెదురైనది. గతంలో అనుసరిస్తున్న పద్దతికి భిన్నంగా చేపట్టిన ఈ విధానాన్ని కొట్టివేసింది. 

కళాశాలల్లో చదివే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు జీవోలను రద్దు చేసింది. ఒక త్రైమాసికానికి ప్రభుత్వం జమ చేసిన సొమ్మును 40 శాతం మంది తల్లులు కాలేజీలకు చెల్లించలేదని కోర్టు తెలిపింది. 

‘‘తల్లులు ఫీజు చెల్లించకపోతే కాలేజీలు ఏం చేయాలో చెప్పలేదు. వారి పిల్లలు కళాశాలల్లో కొనసాగే విషయంపై జీవోలో స్పష్టత లేదు. అలా కాకుండా… నేరుగా కళాశాలల ఖాతాల్లో సొమ్మును జమచేస్తే విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువ. తల్లుల ఖాతాల్లో జమచేయడం వల్ల చదువుల కొనసాగింపుపై భరోసా ఉండదు’’ అని స్పష్టం చేసింది. 

దీని వల్ల ‘విద్యాదీవెన’ పథకం ఉద్దేశం నెరవేరదని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల అకడమిక్‌ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సొమ్మును జమచేసేందుకు వీలుకల్పిస్తుందని పేర్కొంటూ… ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ‘విద్యాదీవెన’పై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కళాశాల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌హెచ్‌ఆర్‌ ప్రసాద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి తీర్పు ఇచ్చారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. ‘2019 నవంబర్‌ 30న జీవో 115 మేరకు విద్యాదీవెన పథకం కింద ఇచ్చే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సొమ్మును కళాశాలల అకౌంట్లలో జమ చేసేవారు. ఆ తర్వాత ప్రభుత్వం మార్చింది. విద్యాదీవెన సొమ్మును నేరుగా కళాశాలలకు కాకుండా… విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయిస్తూ గత ఏడాది జూన్‌ 16న జీవో 28 తీసుకొచ్చింది. 

ఆ తల్లులు విద్యా దీవెన సొమ్మును ఫీజు చెల్లించకుండా దుర్వినియోగం చేస్తే తమకు సంబంధంలేదని పేర్కొంది. పథకం ద్వారా లబ్ధిపొందే విద్యార్థుల తల్లుల్లో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు, బలహీనమైన ఆర్థిక నేపథ్యం కలిగినవారు. ఈ నేపథ్యంలో పథకం సొమ్మును ఫీజుల కోసం కాకుండా ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

సంక్షేమశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ‘‘విద్యార్థుల తల్లులకు సాధికారికత కల్పించేందుకు ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. కళాశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు పర్యవేక్షించేందుకు తల్లులకు అవకాశం కల్పించింది’’ అని తెలిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి..  జీవోలను రద్దు చేశారు. 

కళాశాలల్లో లోపాలుంటే ఫిర్యాదు చేసే అవకాశం ప్రభుత్వం తల్లిదండ్రులకు కల్పించిందని గుర్తుచేసింది. ఇప్పటికే సొమ్మును తల్లుల ఖాతాలో జమ చేసినట్లైతే, కళాశాలలకు ప్రభుత్వం మళ్లీ చెల్లించక్కర్లేదని పేర్కొంది. విద్యార్థుల నుంచి ఆ సొమ్మును కళాశాలలు వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.