సింహాచలంలో పూర్ణకుంభంపై వివాదం

దేవదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులను బేతఖార్ చేస్తూ, రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన ఆయనకు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ, కొందరు ట్రస్టుబోర్డు సభ్యులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. 

దేవదాయ శాఖ కమిషనర్‌ 2017 డిసెంబరు 28న జారీచేసిన సర్క్యులర్‌ ప్రకారం విశిష్ఠ అతిథులకు మాత్రమే పూర్ణకుంభ స్వాగతం పలకాల్సి ఉంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ దేవస్థానం అధికారులు సింహగిరిపై ప్రధాన విచారణ కేంద్రం వద్ద   ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. 

ఇదిలావుండగా ఈ ఏడాది జూన్‌ 16న ఆలయ అనువంశిక ధర్మకర్త హోదాలో అప్పన్న దర్శనానికి విచ్చేసిన మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకు కరోనా నిబంధనల నెపంతో పూర్ణకుంభం ఆహ్వానం పలకలేదు సరికదా, కనీసం దేవస్థానం ఈఓ సూర్యకళ అక్కడకు రాలేదు. 

కాగా, మాన్సాస్‌ ప్రైవేటు ఆస్తి కాదని.. అది ప్రజల ఆస్తి అనే విషయం ఎంపీ విజయసాయిరెడ్డి తెలుసుకోవాలని మాన్సాస్‌ చైర్మన్‌, మాజీ కేంద్ర మంత్రి  అశోక్‌ గజపతిరాజు హితవు పలికారు. మాన్సాస్‌ నిర్వహణ సక్రమంగా లేనందునే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాననే విషయం గుర్తించుకోవాలని చెప్పారు. హైకోర్టు తీర్పు విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. 

సింహాచలం భూములు 800 ఎకరాలు మాయమయ్యాయని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారని.. అధికారంలో ఉన్నందున సర్వే నంబర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, తనను జైలుకు పంపుతామని తరచూ విజయసాయిరెడ్డి ప్రకటిస్తున్నారని.. ఆయనకు జైలంటే బాగా ఇష్టమన్నట్టు ఉందని, బెయిల్‌పై బయటకు వచ్చిన వారు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.