రాజ్యసభ మాజీ ఎంపీ చందన్ మిత్రా కన్నుమూత

రాజ్యసభ మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ పాత్రికేయుడు చందన్ మిత్రా (65) బుధవారం రాత్రి న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. కొద్దికాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. ఆయన పయనీర్ దిన పత్రిక సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. 

చంద్రన్ మిత్రా మరణాన్ని ఆయన కుమారుడు కుషన్ మిత్రా ధ్రువీకరించారు. 2003 నుంచి 2009 వరకూ రాజ్యసభకు నామినేట్ కాగా, 2010 నుండి 2016 వరకు మధ్య ప్రదేశ్ నుండి బిజెపి  రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  చందన్ మిత్రా 2018 జూలై 18న బీజేపీకి రాజీనామా చేసి, అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 

డాక్టర్ మిత్రా లా మార్టినీర్ కలకత్తా  పూర్వ విద్యార్థి. అక్కడ నుండి,  సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి వెళ్లి, అక్కడ అతను వామపక్ష విద్యార్థుల రాజకీయాలలో అత్యంత చురుకుగా పాల్గొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్రలో ఎంఎ, ఎంఫిల్ చేశారు. హంసరాజ్ కళాశాలలో క్లుప్తంగా అధ్యాపకునిగా పనిచేశారు. .

1984 లో, మిత్రా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ డిగ్రీని పొందారు. అక్కడ మాగ్డలీన్ కాలేజీలో “రాజకీయ సమీకరణ – భారతదేశంలో జాతీయవాదం ఉద్యమం-తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ అధ్యయనం, 1936-1942” అంశంపై పరిశోధనా వ్యాసం సమర్పించారు.

జర్నలిజంలో మిత్ర మొదటగా, కోల్‌కతాలోని ది స్టేట్స్‌మన్‌తో అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీలోని టైమ్స్ ఆఫ్ ఇండియాకు, తరువాత సండే అబ్జర్వర్‌కు మారారు. 1997 లో ది పయనీర్‌లో చేరడానికి ముందు హిందుస్థాన్ టైమ్స్ లో  ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్నారు.

ఒక వార్తాపత్రికను యజమానులుగా కూడా నిర్వహించే సవాళ్ళను స్వీకరించిన అతికొద్ది మంది జర్నలిస్టులలో డాక్టర్ మిత్ర ఒకరు.  1998 లో థాపర్స్ నుండి పతనం అంచున ఉన్న పయనీర్‌ చేపట్టి, దాని మలుపుకు నేతృత్వం వహించారు.  1995 లో రెండు ఎడిషన్‌ల నుండి ఇప్పుడు ఎనిమిది ఎడిషన్‌లకు పెరిగే వార్తాపత్రికగా మార్చారు. ప్రింట్ మీడియా నూతన సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో  ఐదేళ్ల క్రితం హిందీ పయనీర్ ప్రారంభించారు. 

డాక్టర్ మిత్రాకు అసాధారణమైన రాజకీయ పరిజ్ఞానం ఉంది. భారత రాజకీయాల తీరుతెన్నుల గురించిన విశేషమైన అవగాహన ఉంది.  1995 లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ లాలూ ప్రసాద్ యాదవ్ ఓడిపోతారని అంటున్న సమయంలో ఘన విజయం సాధింపబోతున్నారని చెప్పారు. ఆయన చూపిన సీట్లే దాదాపుగా లాలూ గెలుపొందారు. 
రాజకీయాలపై ఆయన అభిరుచి, స్నేహపూర్వక  వ్యక్తిత్వం కారణంగా  బిజెపిలో, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్‌కె అద్వానీ ఇద్దరూ ఆయనను చాలా ఇష్టపడ్డారు. ఆ సామీప్యత ఆయనను క్రియాశీల రాజకీయాలకు ఆకర్షించింది. ఆగస్టు 2003 లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. తిరిగి జూన్ 2010 లో మధ్యప్రదేశ్ నుండి బిజెపి ఎంపిగా రాజ్యసభలో మరొక సారి ఎన్నికయ్యారు.  2018 లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీలో ఎప్పుడు క్రియాశీలకంగా లేరు.

మిత్రా మృతి పట్ల  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేస్తూ:  “చందన్ మిత్రా అత్యుత్తమ జర్నలిస్ట్ , పార్లమెంటేరియన్‌గా తన ప్రతిష్టకు మరింత ప్రాధాన్యతనిచ్చారు. హిందీ హృదయం, దాని చరిత్రపై ఆయన అవగాహన చాలా లోతుగా ఉంది. అతని మరణం భారతీయ జర్నలిజంలో శూన్యతను మిగిల్చింది” అంటూ ట్వీట్ చేశారు.

ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు ఆయన మరణం తనకు ఒక వ్యక్తిగత నష్టం ఉందని చెప్పారు.  “ఆయన  వివేకవంతుడు,  అత్యంత గౌరవనీయమైన పాత్రికేయుడు, ఉత్తమ పార్లమెంటేరియన్. ఆయన మృతి నాకు వ్యక్తిగత నష్టం. ఓమ్ శాంతి” అంటూ ట్వీట్ చేశారు.

చందన్ మిత్రా మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సంతాపం వ్యక్తం చేస్తూ  రాజకీయాలతో పాటు మీడియాలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నానని గుర్తు చేశారు. ఒక ట్వీట్‌లో, ప్రధాన మంత్రి ఇలా వ్రాశారు, “శ్రీ చందన్ మిత్రా జీ బహుశా ఆయన మనస్సు, అంతర్దృష్టుల కోసం గుర్తుంచుకోబడతారు. రాజకీయాలతో పాటు మీడియా రంగంపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన మరణంతో దుఃఖిస్తున్నాను. ఆయన కుటుంభం సభ్యులకు, ఆయన అభిమానులకు సంతాపం. ఓం శాంతి. ”

కాగా, చందన్ మిత్రా మృతికి బీజేపీ నేత స్వపన్ దాస్ గుప్తా సంతాపం తెలిపారు. చందన్ మిత్రా తన సన్నిహిత మిత్రుడే కాకుండా  ఇద్దరూ కలిసి చదువుకున్నామని, ఒకే సమయంలో జర్నలిజంలో చేరామని తెలిపారు. అయోధ్య, సఫ్రాన్ వేవ్‌ను తామిద్దరం దగ్గరుండి చూశామని దాస్‌గుప్తా ట్వీట్ చేశారు. 1972లో తామిద్దరూ పూర్వ పాఠశాలను సందర్శించామని చెబుతూ ఆ ఫోటోను ఆయన షేర్ చేసారు. ”మిత్రమా.. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని,  మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా” అని ఆ ట్వీట్‌లో దాస్‌గుప్తా పేర్కొన్నారు.