చర్చల ద్వారానే చైనాతో సరిహద్దు సమస్యల పరిష్కారం 

చైనాతో సరిహద్దు సమస్యల్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. అయితే, వాస్తవాధీనరేఖ (ఎల్‌ఎసి) వద్ద చైనా ఏకపక్ష చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని స్పష్టం చేశారు. 

జాతీయ భద్రతపై పంజాబ్ యూనివర్సిటీ నిర్వహించిన బలరాంజీ టాండన్ స్మారక సదస్సులో రాజ్‌నాథ్ వర్చువల్‌గా పాల్గొంటూ  సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలున్నాయని గుర్తు చేశారు. అయితే, ఇరు దేశాల సైన్యాలు ఘర్షణలకు దిగకుండా పలు ఒప్పందాల ద్వారా రూపొందించుకున్న ప్రొటోకాల్ నిబంధనలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

గతేడాది తూర్పు లడఖ్‌లో జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తూ చైనా సైన్యం నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు. ఎల్‌ఎసి వద్ద చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ఏకపక్షంగా వ్యవహరించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చి చెప్పారు. 

గల్వాన్‌లో గతేడాది జరిగింది చారిత్రక ఘటన అని సింగ్ అన్నారు. ఆ ప్రాంతంలో మన సైన్యం వీరోచితంగా పోరాడి చైనా సైనికుల్ని వెనక్కి నెట్టిందని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. దేశ సరిహద్దుల విషయంలో మన ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టం చేశారు. భార‌త సైన్యం చూపిన సంయ‌మ‌నం, అస‌మాన ధైర్య‌సాహ‌సాలు రాబోయే త‌రాల‌కూ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని కొనియాడారు. సరిహద్దుల్లో ఉల్లంఘనల్ని సహించబోమని పొరుగు దేశాలను హెచ్చరించారు.

కాగా,  దేశానికి స్వాతంత్య్రం ల‌భించిన‌ప్ప‌టి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భార‌త వ్య‌తిరేక శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌ని ర‌క్ష‌ణ మంత్రి పాకిస్తాన్‌పై విరుచుకుప‌డ్డారు. భార‌త్‌లో అల‌జ‌డి రేపేందుకు పాకిస్తాన్ భూభాగం నుంచి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని ఓ వార్త‌సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ధ్వజమెత్తారు. 

స‌రిహ‌ద్దుల్లో ఈ ఏడాది ఫిబ్రవ‌రిలో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం జ‌రిగింద‌ని పేర్కొంటూ భార‌త్ పొరుగు దేశం చ‌ర్య‌ల ప‌ట్ల వేచిచూసే ధోర‌ణి అవ‌లంభిస్తోంద‌ని తెలిపారు. ఆర్టిక‌ల్ 370, 35ఏ ర‌ద్దుతో జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదం స‌మ‌సిపోతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ల‌డ‌ఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో ప‌లు మౌలిక వ‌సతుల ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని, ఇవి మౌలిక ప్రాజెక్టులే కాకుండా జాతీయ సెక్యూరిటీ గ్రిడ్‌లో కీల‌క భాగ‌మ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పేర్కొన్నారు.