మ‌ధుర‌లో మద్యం, మాంసం నిషేధం

శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌ల‌మైన మ‌ధుర‌లో మ‌ద్యం, మాంసం నిషేధిస్తున్న‌ట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్  ప్ర‌క‌టించారు. మ‌ద్యం, మాంసం అమ్మకాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.

ఆదిత్యనాథ్ జన్మాష్టమి సందర్భంగా మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు జరిపారు. దేవాలయం నిర్వహించిన ‘కృష్ణోత్సవ్’కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్మాష్టమి వంటి పండుగలు జరుపుకోవడం మన ఆధ్యాత్మిక , సాంస్కృతిక వారసత్వ సంపదకు చిహ్నమని ఆయన పేర్కొన్నారు.

పకడ్బందీగా నిషేధం అమలుకు, మద్యం, మాంసం వ్యాపారులు ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు మద్యం, మాంసం వ్యాపారం చేసినవారు పాలఉత్పత్తిని పెంచి మథురకు పూర్వవైభవాన్ని తెచ్చేలా పాలు విక్రయించాలని సూచించారు.

“బ్రిజ్ భూమిని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. దీనికి నిధుల కొరత ఉండదు. మేము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సాంస్కృతిక,  ఆధ్యాత్మిక వారసత్వం యొక్క మిశ్రమాన్ని చూస్తున్నాము” అని ఆయన చెప్పారు. ఒక‌ప్పుడు పాల ఉత్ప‌త్తికి మ‌ధుర ప్ర‌సిద్ధి గాంచింది. ఇక క‌రోనా మ‌హ‌మ్మారిని పార‌ద్రోలాల‌ని శ్రీకృష్ణుడిని ప్రార్థించిన‌ట్లు యోగి పేర్కొన్నారు.

భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేసినందుకు సిఎం ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. చాలాకాలంగా నిర్లక్ష్యంకు గురైన ప్రార్ధనా  స్థలాలు ఇప్పుడు పునరుద్దరణకు నోచుకొంటున్నాయని తెలిపారు. 

ఇంతకు ముందు ప్రభుత్వాలు మతతత్వంగా ముద్ర వేస్తారనే భయంతో దేవాలయాలకు వెళ్లడానికి భయపడే వారని తెలిపారు. ఇప్పుడు రాముడు, కృష్ణుడిని తమ దేవుళ్లుగా చెప్పుకుంటున్నాయని గుర్తు చేశారు. అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత అయోధ్య పునరుద్ధరణ జరుగుతున్నదని తెలిపారు. 

“నేను నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి అయోధ్యకు వెళ్లాను. ఆయన అక్కడ రామలీలాను సందర్శించారు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అయోధ్యలో రామలీలాను సందర్శించిన మొదటి రాష్ట్రపతి ఆయనే” అంటూ ఆదిత్యనాథ్ కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అయోధ్యలో రామలీలాను చూసిన మొదటి ప్రధాని కూడా మోదీ అని చెప్పారు.