పోస్టర్ లో నెహ్రు ఫోటో లేకపోవడంపై అనవసర రాద్ధాంతం

భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముద్రించిన మొదటి డిజిటల్  పోస్టర్ లో  తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఫోటో లేకపోవడంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నట్లు భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసిఎచ్ఆర్) వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో విడుదలయ్యే ఇతర పోస్టర్లలో నెహ్రూ ఫోటో ఉంటుందని నిర్ధారిస్తూ, ప్రస్తుతం దీనిని వివాదాంగా మార్చడం “అనవసరం” అని కొట్టిపారవేశాయి.

“మేము స్వతంత్య్ర  ఉద్యమంలో ఎవరి పాత్రను తక్కువ చేయడానికి ప్రయత్నించడం లేదు” అని పేకరోన్తు ఐసిహెచ్ఆర్ ఉన్నత అధికారి ఒకరు ఈ అంశంపై విమర్శలను తోసిపుచ్చారు.  పైగా, ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా విడుదల చేయనున్న అనేక పోస్టర్‌లలో ఇది ఒకటిమాత్రమే అని తెలిపారు

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి గల  ఐసిహెచ్‌ఆర్, ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకల కింద స్వాతంత్య్ర పోరాటం అనే అంశంపై వరుస ప్రసంగాలు, సెమినార్‌లను నిర్వహిస్తోంది. “ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా విడుదల చేసిన పోస్టర్లలో ఇది ఒకటి మాత్రమే. ఇంకా చాలా మంది ఉంటారు మరియు నెహ్రూ ఇందులో కనిపిస్తారు … దీని చుట్టూ వివాదం అనవసరం” అని ఆ అధికారి తేల్చి చెప్పారు.

ప్రసంగాల పరంపరలో భాగంగా, భారతదేశ స్వాతంత్య్ర  ఉద్యమానికి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడటానికి పలువురు  చరిత్రకారులు, విద్యావేత్తలను కౌన్సిల్ ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చిలో ఐసిహెచ్‌ఆర్ ఛైర్మన్ పదవీకాలం ముగిసిన అరవింద్ జమ్‌ఖేడ్కర్, ఈ పోస్టర్ లో నెహ్రు ఫోటో కనిపించక పోవడం అనాలోచితం, పొరపాటు మాత్రమే అని, ఉద్దేశ్యపూర్వకం కాదని స్పష్టం చేశారు.

“ఇది అనాలోచితమైనది. మనం స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడినప్పుడు నెహ్రూ లాంటి వ్యక్తిని ఎవరూ వదిలివేయలేరు.  ఇది అజాగ్రత్త వల్ల కావచ్చు కానీ ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు చూడరాదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండదని  ఉండదు” అని తెలిపారు.

జంఖేద్కర్ పదవీ విరమణ తర్వాత ఆ పదవిలో వారసుడిని విద్యా మంత్రిత్వ శాఖ ఇంకా నియమించలేదు. పోస్టర్ నుండి దేశ తొలి ప్రధాని ఫోటో లేకపోవడాన్ని సాకుగా తీసుకొని కాంగ్రెస్, వామపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి.