రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీని సులభతరం

వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బదిలీ అయినపుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన  అవసరం ఉండదు.

ఈ నూతన విధానానికి సంబందించిన నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బీహెచ్ సిరీస్ క్రింద వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చు. 

నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలుగల కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/ కేంద్ర/రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు/ఆర్గనైజేషన్లలో పని చేసే ఉద్యోగులు ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా సంచరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాహనం యజమాని ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ అయినపుడు, ఈ వాహనాన్ని కూడా తనతోపాటు తీసుకెళ్ళడానికి కొత్తగా మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు. 

ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని వేరొక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపయోగించాలంటే, 12 నెలల లోపుగా రీ-రిజిస్ట్రేషన్ చేయించవలసి ఉంటుంది. దీంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. బీహెచ్ సిరీస్ స్కీమ్‌తో ఈ కష్టాలకు తెరపడుతుంది.

ఈ కొత్త ప్రక్రియలో వాహనానికి ‘YY BH 1234 XX’ మాదిరిగా రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. దీనిలో తొలి రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్‌ చేసిన సంవత్సరాన్ని, తర్వాత బీహెచ్‌ అంటే భారత్‌ సిరీస్‌ను.. తర్వాత నాలుగు అంకెలతో వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉంటుంది. చివరన ఉండే రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్‌ చేసిన రాష్ట్రాన్ని సూచిస్తాయి.