హంద్రీ-నీవాకు నీరు ఆపమన్న తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వార శ్రీశైలం జలాశయం నుంచి తరలిస్తున్న కృష్ణాజలాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు విజ్ణప్తి చేసింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి పేరుతో నిర్మించిన  ఈ పథకం పూర్తిగా అనధికారిక ప్రాజెక్టు అని ఫిర్యాదు చేసింది. 

ఎపిలో కర్నూలు జిల్లా పరిధిలోని మాల్యాల నుంచి శ్రీశైలం రజర్వాయర్‌లోని కృష్ణానదీజలాలను తరించుకుపోతున్నారని బోర్డు దృష్టికి తీసుకుపోయింది. 1950 లో కేంద్ర ప్రభుత్వం, 1964లో ప్లానిం గ్ కమీషన్ శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుగానే అనుమతి ఇచ్చిందని స్పష్టం చేసింది. 

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 264టిఎంసిల నీటిని రిజర్వాయర్‌లో నిలువ ఉంచి, దిగువన నాగార్జున సాగర్ జలాశయాన్ని నింపేందుకు అవసరాలకు తగ్గట్టుగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని సాగర్‌కు విడుదల చేయాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా వెల్లడించిందని తెలంగాణ గుర్తు చేసింది. 

కృష్ణాబేసిన్‌కు బయటి ప్రాంతంలో ఉన్న పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాలను ఏవిధంగా తరలిస్తారని ప్రశ్నించారు. ఇది బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించటమే పేర్కొన్నారు. కృష్ణాబేసిన్ నుంచి బేసిన్ బయటి ప్రాంతాలకు కృష్ణానదీజలాలను తరలించుకుపోవటాన్ని ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయని తెలిపారు.

హంద్రీనీవా పథకం ద్వారా మరింత అధికంగా కృష్ణానదీ జలాలు తరలించుకు పోయేందుకు ఎపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మల్యాల నుంచి నీటిని తరలించేందుకు ఇదివరకు 3850 క్యూసెక్కుల సామర్ధం మేరకు మాత్రమే ప్రధాన కాలువ నిర్మించారని చెప్పారు. 

అయితే ఇప్పడు ఈ కాలువ ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేందుకు హంద్రీనీవా పథకం కాలువ సామర్ధాన్ని పెంచుతూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఎపి ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్‌కు వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేశారు.

వరద జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని గుర్తు చేశారు.  వీటిన్నింటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటివాటాలు చేసేవరకూ హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను తరలించకుండా ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.