గణపతి విగ్రహాల ఎత్తుపై ఆంక్షల్లేవు 

గణపతి విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పోలీసుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయితే నిర్వాహకులే ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. 

వచ్చే నెల 10వ తేదీనుంచి ప్రారంభం కానున్న గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి తలసాని అధ్యక్షతన గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తలసాని చెప్పారు. కరోనా రూల్స్ పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిపించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేసేలా హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, సఫిల్ గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగించాలని అధికారులను ఆదేశించారు. 

అవసరమైన స్టాటిక్, మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేయాలని, 3 షిఫ్టుల్లో సిబ్బంది పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసిద్ధి గాంచిన బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం అయ్యాయని ఉత్సవకమిటీ నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్ని సోమవారం సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని అక్కడే ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు.

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసులు సహకరించాలని, క్రేన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌ విజ్ఞప్తి చేశారు.  అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్‌ సాగర్, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టాలని నిర్వాహకులు కోరగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ను ఆదేశించారు.  దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీబీ ఆధ్వర్యంంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తామని చెప్పారు.