ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌లో రోహిత్‌కు స్వర్ణం

దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ లో మనవాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 48 కేజీల విభాగంలో రోహిత్ చమోలి స్వర్ణం సాధించాడు. ఆదివారం జరిగిన పోటీలో మంగోలియాకు చెందిన ఒత్‌గోన్‌బయర్ తువ్‌సింజయాను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 

తొలి రౌండ్‌లో ఓడిపోయిన చమోలీ తర్వాత ర్యాలీ చేసి.. 3-2 తేడాతో విజయం సాధించాడు. ఈ విషయాన్ని బాక్సింగ్‌ ఫెడరేషన్ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా వెల్లడించి రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

కాగా, గౌరవ్ సైనీ (70 కేజీలు), భరత్ జూన్ (+81 కేజీలు) కూడా పురుషుల పోటీలో బంగారు పతకాల కోసం ఇవాళ రాత్రి పోటీ పడనున్నారు. అలాగే, ముస్కాన్ (46 కేజీలు), విషు రథీ (48 కేజీలు), తను (52 కేజీలు), ఆంచల్ సైని (57 కేజీలు), నికిత (60 కేజీలు), మహి రాఘవ్ (63 కేజీలు), రుద్రిక (70 కేజీలు), ప్రాంజల్ యాదవ్ (75 కేజీలు), సంజన (81 కేజీలు), కీర్తి (+81 కేజీలు) బాలికల ఫైనల్స్‌లో పోటీపడతారు.

బాలికల సెమీ ఫైనల్స్‌లో దేవికా ఘోర్‌పదే (50 కేజీలు), ఆర్జూ (54 కేజీలు), సుప్రియ రావత్ (66 కేజీలు) ఓడిపోగా.. జూనియర్ ఈవెంట్‌లో భారత్ ఇప్పటికే ఆరు కాంస్య పతకాలు సాధించింది.  బాలుర ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్నది.

సోమవారం మహిళల క్యాటగిరీ పోటీలు, పురుషుల ఫైనల్స్ పోటీలు జరుగనున్నాయి. 2019 లో యూఏఈలోని ఫుజైరాలో జరిగిన చివరి ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం 21 పతకాలతో (6 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది.