250 శాతం పెరిగిన మొబైల్ ఫోన్ల ఎగుమ‌తులు

క‌రోనా రెండో వేవ్ ఉధృతి ఉన్నా మొబైల్ ఫోన్ల ఎగుమ‌తులు స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాయి. 2020తో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు నెల‌ల్లోనే 250 శాతం మొబైల్ ఫోన్లు ఎగుమ‌తులు పెరిగాయి. గ‌తేడాది స్మార్ట్‌ఫోన్ల ఎగుమ‌తితో రూ.1,300 కోట్ల ఆదాయం సంపాదిస్తే ఈ ఏడాది రూ.4,600 కోట్ల ఆదాయం వ‌చ్చింద‌ని ఇండియా సెల్యూలార్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ అసోసియేష‌న్ (ఐసీఈఏ) తెలిపింది. 

గ‌మ్మ‌త్తేమిటంటే 2020-21 చివ‌రి త్రైమాసికం (జ‌న‌వ‌రి-మార్చి)లో మొబైల్స్ ఎగుమ‌తుల విలువ‌ రూ.8,636 కోట్ల నుంచి ప‌డిపోయింది. గ‌త ఏప్రిల్‌-జూన్ మ‌ధ్య ఎల‌క్ట్రానిక్ గూడ్స్ ఎగుమ‌తులు రూ.20 వేల కోట్ల మార్క్‌ను దాటాయి. ఇది 2019-20తో పోలిస్తే రెట్టింపు.

దేశీయంగా పీఎల్ఐ స్కీం కింద ఎల‌క్ట్రానిక్ గూడ్స్ ఉత్ప‌త్తిని కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌డం కూడా దీనికి ఓ కార‌ణం. త‌త్ఫ‌లితంగా మొబైల్ ఫోన్ల ఉత్ప‌త్తి, ఎగుమ‌తిలో గ‌ణ‌నీయ పురోగ‌తి సాధించామ‌ని ఐసీఈఏ చైర్మ‌న్ పంక‌జ్ మొహింద్రో తెలిపారు. అయినా.. గ్లోబ‌ల్ ఎగుమ‌తి దారుగా భార‌త్ ఎద‌గ‌డానికి మ‌రింత దూరం ప్ర‌యాణించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

2014-15తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల దిగుమ‌తులు భారీగా ప‌డిపోయి ఆల్‌టైమ్ రికార్డు నెల‌కొల్పాయి. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో రూ.3,100 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు దిగుమ‌తి చేసుకుంటే, ఈ ఏడాది రూ.600 కోట్ల‌కే ప‌రిమితం అయ్యాయ‌ని పంక‌జ్ మొహింద్రో తెలిపారు. అయిన‌ప్ప‌టికీ డెస్క్‌టాప్‌, టాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్స్ కోసం గిరాకీ పెరిగింది.

లాప్‌టాప్స్‌, టాబ్లెట్స్ గ‌తేడాదితో పోలిస్తే 50 శాతం దాటి రూ.10 వేల కోట్ల‌కు చేరుకున్నాయి. గ‌త జ‌న‌వ‌రి-మార్చి మ‌ధ్య‌లోనూ ల్యాప్‌టాప్‌, టాబ్లెట్ల దిగుమ‌తుల విలువ రూ.9,597 కోట్ల‌కు చేరింద‌ని ఐసీఈఏ డేటా పేర్కొంది. భార‌త్‌లో మొబైల్ ఫోన్ల త‌యారీలో సాధించిన‌ట్లే ఐటీ హార్డ్‌వేర్ (డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు) త‌యారీలోనూ ప్ర‌తిబింబించాలని మొహింద్రో ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా భారీ స్థాయిలో ఎల‌క్ట్రానిక్ గూడ్స్ ఉత్ప‌త్తిని ప్రోత్స‌హించేందుకు అనువైన విధానాన్ని ప్ర‌భుత్వం అమ‌లులోకి తేవాల‌ని పేర్కొన్నారు.

ఇందుకోసం తాము ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. చైనా నుంచి ఇంటిగ్రేటెడ్ స‌ర్క్యూట్స్ (ఐసీ)ల వంటి విడి భాగాల కొర‌త‌, ఎగుమ‌తి ఖ‌ర్చులు పెర‌గ‌డం కూడా ఒకింత స్మార్ట్ ఫోన్ల ఎగుమ‌తిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపింద‌ని మొహింద్రో చెప్పారు.