సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్త

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 
 
దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ మనం ఇంకా కరోనా సెకండ్ వేవ్ మధ్య లోనే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. ‘దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదు. ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ మధ్యలో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రానున్న రెండు నెలల్లో (సెప్టెంబర్‌, అక్టోబర్‌) పలు పండుగలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ పండుగలను కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ జరుపుకోవాలి. లేకుంటే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెంది కరోనా కేసులు పెరిగే ప్రమాదముంది’ అని హెచ్చరించారు. 
ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బైరామ్ భార్గవ వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ కలిగిస్తాయే తప్ప నివారించలేవని, అందువల్ల మాస్క్‌ల వాడకం కొనసాగించడం ముఖ్యమని సూచించారు. ప్రతి పండగ తరువాత కరోనా కేసులు పెరుగుతుండడం అనుభవమేనని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పండగల్లో జాగ్రత్తలు పాటించాలని భూషణ్ సూచించారు. దేశం లోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని, దేశ వ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో 58.4 శాతం ఒక్క కేరళ లోనే నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా,  కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని కేంద్రప్రభుత్వం తగ్గించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంలోని అత్యున్నత అధికారుల స్థాయిలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ)తో చర్చించి వ్యవధి తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఎన్‌టీఏజీఐ చీఫ్‌ ఎన్‌కే అరోరా ఈ వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం 12-16 వారాల మధ్య వ్యవధితో కొవిషీల్డ్‌ టీకా డోసులు ఇస్తున్నారు.
 
 కాగా, సెప్టెంబ‌ర్‌లో 20 కోట్ల కొవిషీల్డ్ డోసుల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి, ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది. ఆగ‌స్ట్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎస్ఐఐ 12 కోట్ల కొవిషీల్డ్ డోసులు స‌ర‌ఫ‌రా చేసింద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.