కేరళలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కెరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే మొహర్రం, ఓనమ్‌, రక్షాబంధన్‌ వంటి వరుస పండుగ సెలవుల నేపథ్యంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి.

పండుగల సమయంలో కరోనా నిబంధనలను సడలించడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది మే 20 తర్వాత మరోసారి వైరస్‌ కేసులు 30 వేల మార్కును దాటాయి. రెండో వేవ్ ప్రారంభమైన తర్వాత కరోనా కేసులు 30,000కు మించి నమోదు కావడం ఇదే మొదటిసారి. పైగా, 14 జిల్లాల్లో 2,000కు పైబడి కేసులు నమోదయ్యాయి.

ఎర్నాకులం జిల్లాలో 4,000కు పైబడి కేసులు నమోదు కాగా, మరో మూడు జిల్లాలో 3,000కు పైబడి ఉన్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 31,445 కరోనా కేసులు, 215 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,83,429కు, మొత్తం మరణాల సంఖ్య 19,972కు పెరిగింది.

గత అనేక వారాలుగా, దేశంలో నమోదవుతున్నరోజువారీ కేసులలో  కేరళలో సగంకుపైగా నమోదవుతున్నాయి.  మరణాల రేటు 0.5 శాతంగా మాత్రమే ఉన్నప్పటికీ, లాక్ డౌన్, పలు ఆంక్షలను అమలు పరుస్తున్నప్పటికీ కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. కేరళలో అధిక సంఖ్యలో ఇన్ఫెక్షన్లను పరిశీలించడానికి కేంద్రం నియమించిన ఆరుగురు సభ్యుల బృందం ఇంతకుముందు ఇంటి ఐసోలేషన్ ప్రోటోకాల్‌లు, కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలు, తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు జరపడం వంటి లోపాలను నివేదించింది.

అయితే రాష్ట్రంలో మహమ్మారి నియంత్రణ వ్యవస్థ విఫలమైందని పేర్కొంటూ, ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి. వ్యాధి నిర్వహణ కోసం ప్రస్తుతం ఉన్న వ్యూహాలను, పద్దతిని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ రోగుల సంఖ్య 38 లక్షలు దాటినప్పటికీ, ప్రభుత్వం దానికి సంబంధించిన ఆరోగ్య డేటాను దాచిపెట్టడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇది వ్యాధి మూడవ వేవ్ తో  పోరాడటానికి అభివృద్ధి చెందుతున్న వ్యూహాలను నిరోధిస్తుందని ప్రతిపక్ష నేత వి.డి. సతీసన్ విమర్శించారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఇటీవల ఓనమ్ తరువాత  కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆసుపత్రులను సన్నద్ధం చేసిన దాఖలాలు లేవు. వేడుకలు, షాపింగ్ కోసం బయలుదేరిన వ్యక్తులకు  సడలింపులు ఇవ్వడం, కరోనా లేని వారికి తగిన ప్రవర్తన ప్రభావం రాబోయే కొద్ది రోజుల్లో కనిపిస్తుందని రాష్ట్రంలోని ఆరోగ్య నిపుణులు ఇంతకు ముందే హెచ్చరించారు.