త్వరలో భారత్‌కు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ

సరిహద్దు దేశాల నుంచి సమస్యలు పొంచివున్నందున ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా భారతదేశం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే రాఫేల్‌యుద్ధవిమానాలను సొంతం చేసుకున్న భారత్‌.. రష్యాకు చెందిన ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ త్వరలో అందుకోనున్నది. ఈ ఏడాది చివరికల్లా ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ భారతదేశానికి అందుబాటులోకి రానున్నది.

భూమి నుంచి గాలికి క్షిపణి రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రావడం ద్వారా భారతదేశంలోని ఫైర్‌పవర్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ మిలిటరీ టెక్నికల్ ఫోరం ‘ఆర్మీ -2021’ లో ప్రసంగించిన అల్మాజ్ ఎన్టే డిప్యూటీ సీఈవో వచెస్లావ్ జిర్క్లాన్ ఈ సమాచారం ఇచ్చారు.

‘ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను ఆపరేట్ చేయడానికి భారతీయ సైనికులకు శిక్షణ ఇస్తున్నాం. ఫస్ట్‌ బ్యాచ్‌ శిక్షణ పూర్తవగా, రెండో బ్యాచ్‌ శిక్షణ కొనసాగుతున్నది. ఎంత మంది శిక్షణ పొందుతున్నారనే సంఖ్యను చెప్పలేను’ అని వచెస్లావ్ చెప్పారు. 2018 అక్టోబర్‌లో దీని కోసం భారతదేశం దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది.

రష్యా నుంచి ఐదు ఎస్‌-400 సిస్టమ్‌లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను పొందుతున్న మూడో దేశంగా భారతదేశం అవతరించనున్నది. ఇప్పటికే చైనా, టర్కీతో రష్యా ఒప్పందాలు చేసుకున్నది. ఇటీవల టర్కీకి కొన్ని వ్యవస్థలను కూడా అందించింది.

ఎస్‌-400 సిస్టమ్‌ అనేది వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు, ఆకాశం నుంచి క్షిపణులను బుగ్గిచేయగలదు. దీనికి గాలిలో ఉండే 100 కు పైగా బెదిరింపులను గ్రహించగల శక్తి ఉంటుంది. అలాగే, ఇది అమెరికా తయారు చేసిన ఎఫ్‌-35 వంటి 6 యుద్ధ విమానాలను ఒకేసారి కాల్చగలదు. ఒకేసారి మూడు దిశల్లోకి వెళ్లగలగడం, ఒకే రౌండ్‌లో 36 స్ట్రైక్‌లను చేయగలగడం దీని ప్రత్యేకత.