కాబూల్ విమానాశ్రయానికి ఉగ్ర ముప్పు

ఆఫ్ఘన్‌లో పలు దేశాల పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్టులో యూఎస్‌ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్రవాద ముప్పు ఉందని బ్రిటన్ హెచ్చరించింది. అక్కడి నుంచి తరలిపోవాలని ప్రజలను కోరింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వయిజరీని సవరించింది. 

ఎయిర్‌పోర్ట్ గేట్ వెలుపల ఉన్న తమ పౌరులను వెంటనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోవాలని, తప్పనిసరిగా సూచనలు పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. కాబూల్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ వద్ద ఎవరైనా అమెరికన్‌ పౌరులుంటే ఆయా ప్రదేశాలను ఖాళీ చేయాలని చెప్పింది.

కాబూల్ విమానాశ్రయం వెలుపల ఉన్న అమెరికా పౌరులు విమానాశ్రయం వైపు ప్రయాణించొద్దని సూచించినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. యూఎస్ ప్రభుత్వ ప్రతినిధి వ్యక్తిగతంగా సంప్రదించి కోరితే తప్పా.. ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని స్పష్టం చేశారు. 

మరో వైపు బ్రిటన్‌ సైతం విమానాశ్రయం వైపు వెళ్లొద్దని పౌరులకు సూచించింది. విమానాశ్రయ ప్రాంతం నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో బ్రిటిష్ పౌరుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం ఇంకా అందుబాటులో లేదు.

‘‘కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళకండి. ఆ ప్రాంతంలో మీరు ఉంటే సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోండి. తదుపరి సలహా కోసం వేచి చూడండి’’ అని బ్రిటన్‌లోని ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సీడీఓ) ట్రావెల్ అడ్వయిజరీ హెచ్చరించింది. 

బ్రిటన్ సైన్యం ఇటీవల వేలాది మంది 7వేల మంది బ్రిటిష్ పౌరులు సహా 11వేల మందికిపైగా ప్రజలను ఆఫ్ఘన్‌ నుంచి ఖాళీ చేయించింది. మరో వైపు ఆస్ట్రేలియా సైతం విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న ఆస్ట్రేలియన్లు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని చెప్పింది.  ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ గత వారం బుధవారం నుంచి ఆస్ట్రేలియా దాదాపు 4వేల మందిని విమానాశ్రయం నుంచి తరలించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 1200 మందిని తరలించామని వివరించారు.

కాగా, చదువుకున్న ఆఫ్ఘన్ మహిళలు భయంతో వణికి పోతున్నారు. స్థానిక మహిళా జర్నలిస్టు వహిదా ఫైజి దేశం వదిలి వెడుతూ కన్నీటి సంద్రమయ్యారు.   ‘ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటే మాత్రం తాలిబన్లు కచ్చితంగా చంపేస్తారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బహుశా ఈ దేశానికి తిరిగి రాలేకపోవచ్చునని చెప్పారు.  ‘నా దేశమంటే నాకెంతో ఇష్టం. కానీ నేను ఇక్కడ ఉండలేను’ అంటూ భారీగా విమానాశ్రయం వద్దకు చేరిన జన సమూహం మధ్యలో ఉండే సమాధానమిచ్చారు.

కాబూల్‌లో ఆ దేశ మీడియాకు చెందిన టోలో న్యూస్‌  చెందిన జియార్ యాద్ అనే జ‌ర్న‌లిస్టును తాలిబ‌న్లు కొట్టారు. తొలుత తాలిబ‌న్ల దాడిలో జ‌ర్న‌లిస్టు జియార్ చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ ఘ‌ట‌న‌ను టోలో న్యూస్ ఖండించింది. దేశంలో ఉన్న పేద‌రికం, నిరుద్యోగ అంశాల‌పై రిపోర్ట్ చేస్తున్న స‌మ‌యంలో జియార్‌పై తాలిబ‌న్లు దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.