140 మంది హిందువు, సిక్కు ఆఫ్ఘ‌న్ల‌ను అడ్డుకున్న తాలిబ‌న్లు

ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్ర‌యానికి వెళ్లేందుకు వ‌స్తున్న 140 మందిని తాలిబ‌న్ల అడ్డుకున్నారు. వారంతా హిందువు, సిక్కు మ‌తానికి చెందిన‌వారని ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫోర‌మ్ అధ్య‌క్షుడు పునీత్ సింగ్ తెలిపారు. తాలిబ‌న్ల ఇచ్చిన డెడ్‌లైన్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాబూల్ నుంచి త‌ర‌లివెళ్లేందుకు జ‌నం ఎయిర్‌పోర్ట్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. అయితే హిందూ, సిక్కు మ‌తానికి చెందిన 140 మందిని ఇవాళ తాలిబ‌న్లు అడ్డుకున్న‌ట్లు ఇండియ‌న్ వ‌రల్డ్ ఫోర‌మ్ పేర్కొన్న‌ది. 

దీని వ‌ల్ల కాబూల్ విమానాశ్ర‌యం నుంచి ఆఫ్ఘన్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు విమానాశ్రయంలో బుధవారం నుంచి భారత వాయు సేన ప్రత్యేక విమానం వేచి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గురువారం ఉదయానికి హిందోన్ ఎయిర్‌బేస్‌కు ఈ విమానం వచ్చి ఉండేది. 

బుధ‌వారం రాత్రి విమానాశ్ర‌యం వ‌ద్ద భారతీయులను తాలిబ‌న్లు వెన‌క్కి పంపించిన‌ట్లు పునీత్ సింగ్ తెలిపారు.ఎవ‌రూ దేశం విడిచి వెళ్ల‌వ‌ద్దు అంటూ మ‌రో వైపు తాలిబ‌న్లు స్థానికుల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. మ‌రికొన్ని వారాల్లో ఏర్పాటు కానున్న ఇస్లామిక్ ఎమిరేట్ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేయాల‌ని కోరుతున్నారు.

త‌ర‌లింపు ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు భారత్  సుమారు 565 మందిని త‌ర‌లించింది. దీంట్లో 175 మంది భార‌తీయ ఎంబ‌సీ సిబ్బంది ఉన్నారు. దానికి తోడు 263 మంది భారతీయులతో పాటు 112 మంది ఆఫ్ఘ‌న్ జాతీయులు కూడా ఉన్నారు. సాయుధ ఉగ్రవాదుల పహారా, వివిధ దేశాల విమానాలకు అనుమతులు లభించడంలో ఆలస్యం, ల్యాండింగ్ పర్మిషన్ల జాప్యం, విమానాశ్రయం సమీపంలో కాల్పులు వంటివి కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రజలను తరలించేందుకు అడ్డంకులుగా మారాయని తెలుస్తోంది.