అమెరికాను భయపెడుతున్న హవానా సిండ్రోమ్

అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేకమైన హవానా సిండ్రోమ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలకు అంతు పట్టడం లేదు. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో వెంటాడుతోంది. ఈ సిండ్రోమ్ కారణం గానే తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వియత్నాం పర్యటన కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. 

వియత్నాం లోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స కోసం తరలించాల్సి వచ్చింది. 2016 లో తొలిసారి దీన్ని క్యూబా లోని హవానా నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది.

ఈ సారి దౌత్య సిబ్బంది ఇంటి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఇక్కడి సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా తెలిపింది.   దీంతో ఒక్కసారి అప్రమత్తమైన అమెరికా సిబ్బంది కమలా హారిస్ పర్యటన ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్టు చప్పుడు వినిపిస్తుంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం కలుగుతుంది. అంతేకాదు విపరీతమైన అలసటతోపాటు ఏ విషయాన్ని గుర్తు పెట్టుకోలేరు. క్యూబాలో ఈ ప్రభావానికి గురైన వారిలో మూడో వంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది.

వారి మెదడును స్కాన్ చేసిన డాక్టర్లకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ సిండ్రోమ్ బారిన పడిన వారి మెదడు దెబ్బతిన్నట్టు గుర్తించారు. సాధారణంగా ఏదైనా ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదు. తొలిసారి హవానాలో బయటపడడంతో ఆ పేరుతోనే ఈ సిండ్రోమ్‌ను పిలుస్తున్నారు. 

కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. క్యూబా, చైనా దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సిఐఎ సిబ్బంది, విదేశాంగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా.

మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తు తెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా అనుమానిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్, రష్యా లోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్ బాధితుల జాబితాలో ఉన్నారు.

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఈ సిండ్రోమ్ వ్యాప్తికి క్యూబాయే కారణమని అమెరికా నిందించింది. కానీ తరువాత అమెరికా లోని అధికారులు కూడా దీని బారిన పడడంతో అమెరికా దీనికి కారణమేమిటో తెలుసుకోడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా దౌత్యవేత్తలను టార్గెట్‌ చేస్తున్న ఈ సమస్యను ‘హవానా సిండ్రోమ్‌’ అని అంటారు. గత ఐదేళ్ల నుండి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా.

ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ మెడిసిన్‌ (ఎన్‌ఏఎస్‌ఈఎం) పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్‌ తరంగాలను వినియోగించే అవకాశం ఉందన్న అంచనాలకు వచ్చారు. సోవియట్‌ యూనియన్‌ 1950ల్లో మైక్రోవేవ్‌ తరంగాలను ఆయుధంలా వినియోగంచడంపై పరిశోధనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా ఎన్‌ఏఎస్‌ఈఎం నివేదికను బలపర్చింది.