ఇన్ఫోసిస్‌ చీఫ్‌ పరేఖ్‌కు ఆర్థిక శాఖ సమన్లు

ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో కొనసాగుతున్న లోపాలపై వివరణ ఇవ్వాలంటూ ఇన్ఫోసిస్‌ చీఫ్‌ సలీల్‌ పరేఖ్‌కు ఆర్థిక శాఖ సమన్లు జారీ చేసింది. ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ అభివృద్ధి చేసింది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా ఐటీ ఫైలింగ్ పోర్టల్ ఉండాలని కొత్తగా డెవలప్ చేసేందుకు 2019 జనవరి – 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లుతో ఇన్ఫోసిస్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టును అప్పగించింది. ఈ ఐటీ కంపెనీ వర్క్ పూర్తి చేశాక జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది.

అయితే ఐటీ ఫైలింగ్‌లో ట్యాక్స్‌ పేయర్లు, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐటీ ఫైలింగ్ ప్రొఫైల్ మార్పులు, పాస్‌వర్డ్ మార్చుకోవడం లాంటి చిన్న చిన్న విషయాల్లోనూ, ఫైలింగ్ సమయంలో సైట్ హ్యాంగ్ కావడం వంటి సమస్యలు పదే పదే వస్తుండడంతో ట్యాక్స్ పేయర్లు కేంద్ర ఆర్థిక మంత్రిని ట్యాగ్‌ చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు ఫిర్యాదు చేశారు.

దీంతో ఇప్పటికే ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకనీ వారం వారం కేంద్ర ఆర్థిక మంత్రికి రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే రెండున్నర నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇప్పడు నేరుగా సీఈవోకే నోటీసులు పంపింది కేంద్ర ప్రభుత్వం. అంతకముందు ఈ సమస్యపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  

ఈ పోర్టల్‌ పన్ను చెల్లింపు దారులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని పరేఖ్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రవీణ్‌ రావ్‌లకు సూచించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదాయ పన్ను శాఖ అధికారిక ట్విట్టర్‌లో ఇన్ఫోసిస్‌ అధికారులకు సమన్లు జారీ చేసిన విషయాన్ని ట్వీట్‌ చేసింది.

‘ ఇ- పోర్టల్‌ మొదలై రెండున్నర నెలలు గడుస్తున్నప్పటికీ అందులో లోపాలను సరిదిద్దకపోవడంపై ఆర్థిక శాఖ మంత్రికి వివరణ ఇవ్వాలంటూ ఇన్ఫోసిస్‌ సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్‌ పరేఖ్‌లకు సమన్లు జారీ చేశారు. వాస్తవంగా ఈ నెల 21 నుండి పోర్టల్‌ కూడా అందుబాటులో లేదు’ అని పేర్కొంది.

కాగా, దీనికి ఇన్ఫోసిస్‌ ట్విట్టర్‌లో వివరణ నిచ్చింది. ఇది ఇంకా నిర్వహణలో ఉన్నట్లు తెలిపింది. ఈ పోర్టల్‌ మొదలైన నాటి నుండి వినియోగదారులు పలు సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను తీసి.. ఆర్థిక శాఖకు ట్యాగ్‌ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ పోర్టల్‌ తలనొప్పిని తెప్పిస్తోందని వాపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.