కళ్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని, పలువురి సంతాపం

యూపీ మాజీ ముఖ్యమంత్రి క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, పలువురు ప్రముఖులు విచారం వ్య‌క్తం చేశారు. “క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం మాట‌ల్లో చెప్ప‌లేని దుఃఖం. క‌ల్యాణ్ సింగ్ జీ రాజ‌నీతిజ్ఞుడు. పేరొందిన కార్యనిర్వాహ‌కుడు. ప్ర‌జా నాయ‌కుడు. గొప్ప మాన‌వ‌తా వాది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అభివ్రుద్ధిలో ఆయ‌న పాత్ర ఎన‌లేనిది” అని ప్రధాని ట్వీట్ చేశారు. 

ఆయ‌న కుమారుడు రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడానని పేర్కొంటూ  భార‌త సాంస్క్రుతిక పున‌రుత్తేజంలో ఆయ‌న సేవ‌లు భ‌విష్య‌త్ త‌రాల‌కు చిర‌స్మ‌ర‌ణీయంగా ఉంటాయని ప్రధాని తెలిపారు. శ‌తాబ్దాల క్రితం సంప్ర‌దాయాల‌కు గర్వ‌కార‌ణం. భార‌తీయ విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన నేత క‌ల్యాణ్ సింగ్ అని అభివ‌ర్ణించారు.

ఉపరాష్ట్ర‌ప‌తి ఎం వెంక‌య్య‌నాయుడు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. యూపీ మాజీ సీఎం క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం తీవ్ర బాధ‌ను మిగిల్చిందని, ఆయ‌న రాజ‌స్థాన్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేశార‌ని గుర్తు చేశారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ఆద‌ర్శ ప్రాయుడు అని ట్వీట్ చేశారు. జాతీయ వాది అని పేర్కొన్నారు.

 క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర సంతాపం చేశారు. ఆయ‌న త‌న జీవితాన్ని దేశానికి, ప్ర‌జ‌ల‌కు అంకితం చేశార‌ని కొనియాడారు. జాతీయ వాదిగా ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌కాలం నిలిచిపోతార‌ని శ‌నివారం రాత్రి ట్వీట్ చేశారు. క‌ల్యాణ్ సింగ్ వంటి గొప్ప వ్య‌క్తిత్వం గ‌ల నేత‌లు అరుదుగా ఉంటార‌ని పేర్కొన్నారు.

యూపీ సీఎంగా క‌ల్యాణ్ సింగ్ సుప‌రిపాల‌న‌ను అందించార‌ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. రాజ‌కీయ చాతుర్యంతో, భ‌క్తితో ప్ర‌జా సంక్షేమ ప్ర‌భుత్వంగా పాల‌న సాగించార‌ని పేర్కొన్నారు. సుప‌రిపాల‌న‌కు అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ అని కొనియాడారు. విద్యారంగంలో అసాధార‌ణ సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చార‌ని తెలిపారు. క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల యావ‌త్ దేశం, బీజేపీ కుటుంబం తీవ్ర సంతాపం తెలియ‌జేస్తున్న‌ద‌ని హిందీలో ట్వీట్ చేశారు.

ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్పందిస్తూ.. క‌ల్యాణ్ సింగ్ భార‌తీయ రాజ‌కీయాల్లో ధైర్య సాహ‌సాలు గ‌ల నేత‌. దేశానికి, స‌మాజానికి అందించిన ఆయ‌న సేవ‌లు చెరిగిపోవు అని త్లెఇపారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఓ సోదరుడ్ని కోల్పోయాను. ఆయ‌న మ‌ర‌ణంతో ఏర్ప‌డిన శూన్యాన్ని పూడ్చ‌డం క‌ష్టమే అని ట్వీట్ చేశారు. 

కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సైతం క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం తెలిపారు. “మాకు గౌర‌వ‌నీయ సీనియ‌ర్ నేత క‌ల్యాణ్ సింగ్ క‌న్నుమూశార‌ని వ‌చ్చిన వార్త‌లు తీవ్ర విచారాన్ని మిగిల్చాయి” అని పేర్కొన్నారు. జ‌న్‌సంఘ్‌కు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి ఆయ‌న అత్యంత ముఖ్య‌మైన సేవ‌లందించారని గుర్తు చేసుకున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ  క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణంతో ఈ రోజు జాతి త‌న అమూల్య‌మైన పుత్రుల్లో ఒక‌రిని కోల్పోయింది. దేశానికి, శ్రీరాముడికి ఆయ‌న సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు.

క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావ‌తి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. యూపీ మాజీ సీఎంగా, బీజేపీలో ధైర్య‌వంతుడైన నేత‌గా క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణించార‌న్న వార్త చాలా విచారాన్ని కలిగించింద‌ని ఆమె తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు తీవ్ర సంతాపం తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుత విచార స‌మ‌యంలో వారికి దేవుడు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరారు.

కల్యాణ్‌సింగ్‌ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.