`రామాలయ’ ఉద్యమ అగ్రనేత కళ్యాణ్ సింగ్ మృతి

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన మహోత్తర  ఉద్యమంలో కీలక భూమిక వహించిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి అగ్రనేత కళ్యాణ్ సింగ్ గత రాత్రి కన్నుమూశారు. చట్టబద్ధ పాలనా ఎరుగని దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అత్యంత పరిపాలన దక్షునిగా నిరూపించుకున్న ప్రజా నాయకుడు. 

 గత నెల 4 నుంచి ఆయన ఢిల్లీలోని సంజయ్‌గాంధీ పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్జీపీజీఐఎంఎస్‌)లో చికిత్సపొందుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయనకు డయాలసిస్‌ చేస్తూ వచ్చారు. స్టెప్సిస్‌, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో శనివారం తుదిశ్వాస విడిచారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌ల్యాణ్ సింగ్ మ‌ర‌ణానికి రాష్ట్రం మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తుంద‌ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్ర‌క‌టించారు. ఈ నెల 23న ఆయ‌న అంత్య క్రియ‌లు న‌రోరాలో గంగాన‌దీ తీరాన నిర్వ‌హిస్తామ‌ని యోగి ఆదిత్య‌నాథ్ చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

1991 జూన్‌ నుంచి 1992 డిసెంబరు వరకు, 1997 సెప్టెంబరు నుంచి 1999 నవంబరు వరకు రెండుసార్లు ఆయన యూపీ సీఎంగా పనిచేశారు. 1992 డిసెంబరు 26న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయనే సీఎంగా ఉన్నారు. ఆ ఘటన జరిగిన రోజే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. 

రెండోసారి సీఎం అయిన రెండేండ్లకు ఆయనతో బీజేపీ నాయకత్వం రాజీనామా చేయించింది. దీంతో ఆయన పార్టీని వీడారు. మళ్లీ 2004లో తిరిగి బీజేపీలోకి వచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషితో పాటు కల్యాణ్‌ సింగ్‌ విచారణను ఎదుర్కొన్నారు. తర్వాత వారిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. 

2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌ గవర్నర్‌గా కల్యాణ్‌ సింగ్‌ పనిచేశారు. మసీదు కూల్చివేత కేసులో తన ఆదేశాల ప్రకారమే డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నత ప్రభుత్వ అధికారులు నడుచుకున్నారని, జరిగిన పరిణామానాలకు తానే బాధ్యుడిని అంటూ  కోర్ట్ లో అఫిడవిడ్ దాఖలు చేసిన నేత. సాధారణంగా విజయాలను తమ ఖాతాలో వేసుకొంటూ, ప్రతికూలత ఎదురైతే ఇతరులపై నెట్టివేయడం, వారిని బలిపశువులను చేయడం మన రాజకీయ నాయకులు చేస్తుంటారు. 

బిజెపిని అగ్రవర్గాల పార్టీగా అందరూ భావిస్తున్న సమయంలో వెనుకబడిన వర్గాలలోకి చొచ్చుకు పోయి, యుపి వ్యాప్తంగా వందకు పైగా ర్యాలీలు నిర్వహించి,  ములాయంసింగ్ యాదవ్ ప్రాబల్యానికి గండి  కొట్టి, యుపిలో తొలి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. భావోద్వేగాలతో కాకుండా, సామజిక అంశాలపై, ప్రజా సమస్యలపై ప్రజల మద్దతును పార్టీకోసం కూడగట్టుకున్న తొలి బిజెపి నేత అని చెప్పవచ్చు. 

‘‘యూపీ సీఎంగా నేను కూలిపోయే సమయంలో బాబ్రీ కూలిపోవడం విధి రాత. మసీదు కూలిపోకపోతే కోర్టులు ఎప్పటికీ యథాతధ స్థితి కొనసాగించేవి. ఏదైనా మందిరం పూర్తయ్యాక చూడాలన్నది నా ఆశ’’ అని 2020 ఆగస్టులో అయోధ్య రామమందిర భూమిపూజ సందర్భంగా కల్యాణ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. కానీ ఆ ఆశ తీరకుండానే మరణించారు. 

మూకుమ్మడి కాపీలతో పరీక్షలు జరిగే ఉత్తర ప్రదేశ్ లో మొదటిసారిగా కఠినంగా పరీక్షలు నిర్వహించి, కాపీలను ప్రోత్సహిస్తున్న 4,000 మందికి పైగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి,  రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంపొందించడంకోసం విశేషంగా కృషి చేశారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి  జనవరి 5, 1932లో ఆయన  జన్మించారు. అత్రౌలి నియోజకవర్గం నుంచి తొలిసారి కల్యాణ్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

1967 నుంచి 2002 మధ్యకాలంలో మొత్తం పది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి కల్యాణ్ సింగ్ విజయం సాధించారు. రెండు సార్లు యూపీ సీఎంగా, మరో రెండు సార్లు ఎంపీగా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కూడా ఆయన పని చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా శిక్షణ పొందిన కళ్యాణ్ సింగ్ తన సొంతజిల్లా ఆలీఘడ్ లో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు. జనసంఘ్ సంఘటనా కార్యదర్శి నానాజీ దేశముఖ్ ఆయనను రాజకీయాలలోకి తీసుకొచ్చారు.

1996 లో 13 రోజుల బిజెపి ప్రభుత్వం తర్వాత, 1998 లో 182 లోక్‌సభ స్థానాలతో అటల్ బిహారీ వాజ్‌పేయి తిరిగి అధికారంలోకి వచ్చారు. అందుకు ప్రధాన కారణం కల్యాణ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యుపి నుండి బిజెపి 58 స్థానాలను గెలుచుకోవడమే. ఆ తర్వాత బిజెపి అత్యధికంగా 2014లో 71 స్థానాలను గెల్చుకొంది. ఆ సమయంలో బిజెపి ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ఎన్నికల ఇన్  ఛార్జ్  గా వ్యవహరించిన అమిత్ షాకు ఆయన సలహాలే ప్రధాన కారణం అని చెబుతారు. 

కళ్యాణ్ సింగ్ 1967 లో మొదటిసారిగా జన్ సంఘ్ సభ్యుడిగా యుపి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  అదే సంవత్సరం ములాయం సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా మొదటిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. పది సంవత్సరాల తరువాత, ఎమర్జెన్సీ తర్వాత యుపిలో ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో వీరిద్దరూ మంత్రివర్గ సహచరులు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో చాలాకాలం ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు.