కార్వీ ఎండీ పార్థసారధి అరెస్ట్ 

హైదరాబాద్‌ కేంద్రంగా మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. కార్వీ ఎండీ పార్థసారధి పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ 700 కోట్లకు పైగా రుణాలను తీసుకొని వాటిని ఎగవేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని గురువారం అదుపులోకి తీసుకున్నారు.  కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి పార్థసారథి ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంకులో కార్వీ షేర్లను తనఖా పెట్టి దాదాపుగా రూ.780 కోట్లు రుణం తీసుకున్నాడు. 

దీంతో వివిధ బ్యాంకుల అధికారులు నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని అరెస్టు చేసి నాంపల్లిలోని కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని 14 రోజులపాటు రిమాండ్‌కు చంచల్‌గూడా జైలుకు తరలించారు.

ఇందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 340 కోట్లు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో రూ. 137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో రూ.7 కోట్లు ఆయన రుణం తీసుకున్నారని బ్యాంకులు తెలిపాయి. అంతేకాకుండా పార్థసారధి సుమారు రూ. 720 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అయిన కార్వీపై సెబీ మార్గదర్శకాలను పాటించని కారణంగా గతంలోనే ఆ సంస్థపై సెబీ నిషేధం విధించింది. అలాగే కార్వీ తమ సంస్థలోని ఖాతాదారుల సెక్యూరిటీని దుర్వినియోగం చేసిందని తేలడంతో కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా 2019లో సెబీ ఆంక్షలు విధించింది. 

కార్వీ తన ఖాతాదారులకు చెందిన రూ. 2800 కోట్లను దుర్వినియోగం చేసి.. ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకున్నట్లు అప్పట్లో తేలింది. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి తాను తీసుకున్న రుణాల‌ను అక్ర‌మంగా వాడుకున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

కస్టమర్ల షేర్లను ఎండి పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు పొందడం,ఆపై రుణాలు ఏమాత్రం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. స్టాక్ బ్రోకింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కార్వీపై చాలా కాలం నుంచి అక్రమాల ఆరోపణలు వినిపిస్తుండటంతో బ్యాంకుల అధికారులు అప్రమత్తమైయ్యారు.

కాగా కార్వీ రుణాల ఏగవేతపై నగర సిసిఎస్ పోలీసులతో పాటు ఇడి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో కార్విపై గతంలోనే సెబి నిషేధం విధించిందని, బ్యాంకు రుణాలు అక్రమాలకు తరలించిన వైనంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు.