దళితులపై దాడులు జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదు

తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే బీజేపీ ఇకపై చూస్తూ ఊరుకోబోదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తక్షణమే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులకు దిశానిర్ధేశం చేశారు. 

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ మోర్చా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరారు . రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న వారిలో దళితులే ఎక్కవుగా ఉన్నారని, వారిపై నిత్యం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

‘‘ఇకపై దళితుల పక్షాన ఎస్సీ మెర్చా నాయకులంతా ఉద్యమించండి దళితులపై దాడులు జరిగితే తక్షణమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయండి. కఠిన చర్యలు తీసుకునేలా ఉద్యమించండి. తెలంగాణలో దళితులకు బీజేపీ ఎస్సీ మోర్చా అండగా ఉంటుంది’’అని కోరారు.

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ మునుస్వామి మాట్లాడుతూ ఇకపై ప్రజల కోసం, పార్టీ ఉన్నతి కోసం కష్టపడి పనిచేసే మోర్చా నాయకులకు భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు.  సమావేశానికి హాజరైన నాయకులంతా ఈనెల 24 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తామని ముందుకు వచ్చారు.