ఉగ్రవాదుల కాల్పుల్లో అప్నీ పార్టీ నేత మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మరణించారు. కుల్గామ్‌ జిల్లా దేవ్‌సర్‌లోని ఇంటి బయట ఉన్న ఆయనపై ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

పీడీపీ మాజీ బ్లాక్‌ అధ్యక్షుడైన గులాం హసన్‌ లోన్‌ కొన్ని నెలల కిందట బీజేపీకి మద్దతుగా ఉన్న అప్నీ పార్టీలో చేరారు. కాగా, ఆయనపై కాల్పులు జరిపి హత్య చేయడాన్ని అప్నీ పార్టీతోపాటు మాజీ సీఎంలు, పీడీఎఫ్ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. 

కుల్గామ్‌లో గత పది రోజుల్లో ముగ్గురు నేతలు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం కుల్గామ్‌ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.  కాగా, రాజౌరీ జిల్లా పరిధిలోని తనమండి ప్రాంతంలో భారత భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య కాల్పులు సంభ‌వించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఒకరు అమరుడ‌య్యారు.

 ఉగ్రవాదులు తనమండి ప్రాంతంలోని ఒక ఇంట్లో తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించాయి. వీరి సూచనలను ఖాతరు చేయని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్ర‌మంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జేసీఓను సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీక‌రించారు. ఇదే ప్రాంతంలో ఆగస్ట్‌ 6 వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు చ‌నిపోయారు.

ఉగ్రవాది హతం 

కాగా, అవంతిపొరా జిల్లా పాంపొరీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపొరాలోని పాంపొరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా దళాలతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టారు. పోలీసులు, జవాన్లు కలిసి గాలిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. 

దీంతో పోలీసులు, జవాన్లు కలిసి ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు హతం అయ్యారు. ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.

ఆగస్టు 13వతేదీన స్వాతంత్ర్యదినోత్సవానికి రెండు రోజుల ముందు కుల్గాం ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటరులో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హతం అయ్యారు. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో పోలీసుల గాలింపు పెరిగింది. దీంతో తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.